చల్లని వాతావరణంలో ఘాటైన రమ్ గొంతులోకి జారుతుంటే ఆ కిక్కేవేరు. ఆల్కాహాల్ ప్రియులకు రమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వేసవిలో చల్లని బీరుకు, శీతాకాలంలో ఘాటైన రమ్‌కు డిమాండ్ ఎక్కువ. ఈ రోజు ‘నేషనల్ రమ్ డే’. ఈ సందర్భంగా రమ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇవిగో...


పుట్టింది అక్కడే...
మొదటిసారి రమ్‌ను ఏ దేశంలో తాగారో తెలుసా? కరేబియన్ దీవుల్లో. 1620లో దీన్ని అక్కడ తయారుచేసి తాగినట్టు చరిత్ర చెబుతోంది. ఆ దీవుల్లోని బానిస ప్రజలు దీన్ని తమకోసం మొదటిగా తయారుచేసుకున్నారు. అక్కడ్నించే మిగతా దేశాలకు ప్రయాణం కట్టింది రమ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ముఖ్యమైన ఆల్కహాలిక్ పానీయంగా మారింది. ఇప్పటికీ కరీబియా ప్రాంతంలోని ప్యూర్టోరికాలోని శాన్‌జువాన్లో అతి పెద్ద రమ్ డిస్టిలరీ ఉంది. ఇక్కడ ప్రతిరోజూ లక్ష లీటర్ల ఉత్పత్తి చేస్తారు. 


దేనితో తయారుచేస్తారు?
రమ్ తయారీకి వాడే మూల పదార్థం చెరకు. అందుకే ఇది చాలా స్పెషల్ మద్యం అని చెప్పాలి. మిగతా మద్యం రకాలేవీ చెరకుతో తయారు కావు. చెరకును ఉడకబెట్టి, స్కిమ్మింగ్ చేసి, అందులో మిగిలిన మొలాసిస్, అవక్షేపాలతో రమ్‌ను తయారు చేస్తారు. ముఖ్యంగా మొలాసిస్, అవక్షేపాలను పులియబెట్టడం ద్వారా దీన్ని రూపొందిస్తారు. 


రమ్ అనే పదం?
ఈ పానీయాన్ని కరీబియన్ బానిస ప్రజలు ఏమని పిలిచేవారో తెలియదు కానీ, ఇప్పుడు ప్రపంచం మొత్తం దీన్ని రమ్ అనే అంటోంది. ఈ పదం ‘రంబుల్లియన్’ అనే పదం నుంచి ఉద్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ పదానికి అర్థం ‘గందరగోళం, కోలాహలం’ అని. అలాగే డచ్ నావికులు తాగే పొడవాటి గ్లాసులను ‘రమ్మర్స్’ అని పిలుస్తారు. ఆ గ్లాసుల్లో వారు ఈ పానీయాన్ని తాగేవారని, అందుకే రమ్ అని పేరుపెట్టారని కూడా అంటారు. 


ఆరోగ్యప్రయోజనాలు
చెరకు ఆరోగ్యకరమైనదే, రమ్ లో కూడా ఆరోగ్యగప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవి మితంగా తాగినప్పుడే శరీరానికి అందుతాయి. అధికంగా తాగితే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. రమ్ తాగని వారి కంటే, రమ్ అతి తక్కువగా ఎంతో కొంత తాగేవారిలో కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 38 శాతం తక్కువని రుజువైంది. అలాగే థైరాయిడ్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని తేలింది. 


ఆసుపత్రిలో వాడే స్పిరిట్ ఔషధం కోవకు చెందినదే రమ్. కాకపోతే అది తాగరు, ఇది తాగుతారు. 18వశతాబ్ధంలో దీన్ని నావికులు జీతాల రూపంలో యాజమాన్యం నుంచి స్వీకరించేవారు. అంటే కరెన్సీగా కూడా ఈ పానీయం చెలామణీ అయ్యింది. అంతేకాదు దీన్ని జుట్టు రాలకుండా ఔషధంగా వాడేవారు. జుట్టును రమ్‌తో కడిగేవారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా, పట్టులా పెరుగుతాయని వారి నమ్మకం. 


Also read: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే


Also read: కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ