మానవ జీవితాన్ని సులభతరం చేసేందుకు నిత్యం పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఆరోగ్య మహమ్మారులను గుర్తించేందుకు,చికిత్స చేసేందుకు ఇప్పుడు ప్రధానంగా అనేక కొత్త వ్యాక్సిన్లను, పరికరాలను ఆవిష్కరిస్తున్నారు. అలాంటి ఒక కొత్త ఇన్నోవేషన్ ‘క్యాన్సర్ గుర్తించే కాంటాక్ట్ లెన్సులు’. అది కూడా కంటి నుంచే కారే కన్నీటిని ఉపయోగించే అవి క్యాన్సర్‌ను పసిగడతాయి. అమెరికా శాస్త్రవేత్తలు ఈ లెన్సులను అభివృద్ధి చేశారు. 


కాలిఫోర్నియాలోని టెరాసాకి ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ (TIBI) బృందం అభివృద్ధి చేసిన ఈ కాంటాక్ట్ లెన్సులు కన్నీళ్లలోని ఎక్సో‌సోమ్‌లను గుర్తించగలవు, వాటిని సేకరించగలవు కూడా. ఎక్సోసోమ్‌లు అనేవి మన శరీరం నుంచి వచ్చే స్రావాలలో కనిపించే అతి సూక్ష్మమైన వెసికిల్స్. వీటిని క్యాన్సర్‌ బయోమార్కర్లుగా భావిస్తారు. కన్నీళ్లలో ఉండే ఎక్సోసోమ్‌లను సంగ్రహించేలా లెన్సులో సూక్ష్మ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. యాంటీబాడీలతో ఆ సూక్ష్మ ఛాంబర్లు పకడ్బందీగా రక్షణ కల్పించి ఉంటాయి. ఈ లెన్సులు క్యాన్సర్ విషయంలో ప్రీ స్క్రీనింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. వేగవంతమైన, సులభమైన స్క్రీనింగ్‌ను అందిస్తుంది. 


ఎక్సో‌సోమ్‌లు ప్లాస్మా, లాలాజలం, మూత్రం, కన్నీళ్లు... శరీరంలోని ద్రవాలలో కనిపిస్తాయి. ఇవి కణాల మధ్య జీవ అణువులను రవాణా చేసే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి. అయితే శాస్త్రవేత్తలు కన్నీళ్ల నుంచి ఎక్సోసోమ్‌లను గ్రహించేందుకు ఈ కాంటాక్ట్ లెన్సులను రూపొందించారు. ఇది రక్తం, మూత్రం, లాలాజలంలోని ఎక్సో‌సోమ్‌లను సేకరించే పద్ధతి కన్నా చాలా సులభమైనది, శుభ్రమైనది కూడా. అయితే కంటికి ఈ లెన్సులు పెట్టుకున్నాక కన్నీళ్లు కారిస్తేనే ఇవి ఆ ఎక్సోసోమ్‌లను గ్రహిస్తాయి. 


కంటి క్యాన్సరేనా...
లెన్సులు అనగానే కేవలం కంటి సంబంధిత క్యాన్సర్లను మాత్రమే గుర్తించేది అనుకోవద్దు. శరీరంలోని అన్ని అవయవాలకు వచ్చే కాన్సర్లను గుర్తించగలదు. ఎందుకంటే ఎక్సోసోమ్‌లు మొత్తం శరీర ఆరోగ్యాన్ని సూచిస్తాయి. కాబట్టి ఏ క్యాన్సర్ నైనా  ప్రాథమిక దశలోనే తెలుసుకునే అవకాశం ఈ లెన్సుల వల్ల కలుగుతుందని భావిస్తున్నారు పరిశోధకులు.


Also read: ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు 



Also read: గర్భం ధరించాక శృంగారం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?






















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.