ఒకప్పటి పరిస్థితి వేరు. గర్భం ధరించినట్టు తెలియగానే పుట్టింటికి వెళ్లిపోయేది ఇల్లాలు. కానీ ఇప్పుడు ఉద్యోగినుల సంఖ్య అధికంగా ఉంది. మెటర్నిటీ లీవ్ కోసం తొమ్మిదో నెల వరకు పుట్టింటికి వెళ్లకుండా భర్తతోనే ఉండి ఉద్యోగానికి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి చాలా సందేహాలు వస్తుంటాయి. గర్భంతో ఉండగా సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా? అనేది మొదటి సందేహం. ఎప్పటివరకు పాల్గొన వచ్చు? బిడ్డకు ఏదైనా హాని కలుగుతుందా... ఇలాంటి సందేహాలు మనసును తొలిచేస్తుంటాయి. వీటన్నింటీకి ఇక్కడ నిపుణులు చెప్పిన సమాధానాలను అందిస్తున్నాం.
గర్భం అనేది ఒక అద్భుతమైన, అందమైన ప్రయాణం. ప్రతి స్త్రీ కచ్చితంగా అనుభవించాల్సిన క్షణాలు. ఆ సమయంలో సెక్స్ కోరికలు కలగవు అనుకోవడం మాత్రం భ్రమే. కొందరిలో ఆ కోరికలు తగ్గుతాయి. కానీ కొందరిలో సాధారణంగానే ఉంటాయి. మరికొందరు గర్భవతిగా ఉన్నప్పుడే మరింత ఉద్రేకానికి గురవుతారు. గర్భధారణ సమయంలో లైంగిక కోరికలు కలగడం అనేది చాలా సహజం.
సురక్షితమేనా?
గర్భం ధరించాక సెక్స్ చేయడం మంచిదే. దాని వల్ల గర్భంలోని పిండానికి ఎలాంటి హాని జరగదు. పిండం లేదా గర్భస్థ శిశువు పొత్తికడుపు, గర్భాశయం తాలూకు కండరాల గోడల వల్ల సురక్షితంగా ఉంటుంది. ఉమ్మనీటికి కూడా ఎలాంటి హాని కలుగదు. నిజానికి ఆ సమయంలో సెక్స్ చేయడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. స్పెర్మ్ లో ఉండే ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు గర్భాశయాన్ని సంకోచించేలా చేస్తాయి. అయితే ఎవరికైతే నెలల నిండకుండానే ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారో వారు మాత్రం సెక్స్ కు దూరంగా ఉండాలి.
రెండో త్రైమాసికంలో...
గర్భాధారణను మూడు విభాగాలుగా విడదీస్తారు. మొదటి మూడు నెలలను మొదటి త్రైమాసికంగా, తరువాతి మూడు నెలలను రెండో త్రైమాసికంగా, చివరి మూడు నెలలను మూడో త్రైమాసికంగా చెబుతారు. మొదటి త్రైమాసికంలో సెక్స్ కోరికలు కలగడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయంలో మార్నింగ్ సిక్నెస్, అలసట, రొమ్ములు సున్నితంగా మారడం వంటివి కలుగుతాయి. ఇక రెండో త్రైమాసికంలో అంటే నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మాత్రం సెక్స్‌ను ఆస్వాదిస్తారు. పొట్టపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడో త్రైమాసికంలో పొట్ట బాగా పెరిగి ఉంటుంది కనుక అసౌకర్యంగా అనిపిస్తుంది. అటు వైపు ఆలోచనలు కూడా రావు.
అధ్యయనం ఏం చెబుతోంది?
2004లో జరిపిన ఒక అధ్యయనంలో సెక్ వల్ల మీ శరీరంలో IgA అనే యాంటీబాడీ పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొంతమంది జంటలు గర్భధారణ సమయంలో లైంగిక కార్యకలాపాలు ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరిగేందుకు దోహదపడతాయి.
ఎప్పుడు దూరంగా ఉండాలి?
ముందుగా చెప్పినట్టు నెలలు నిండకుండానే ప్రసవం జరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబితే మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే ఆ సమయంలో ఏదైనా నొప్పిని అనుభవిస్తున్నా, పొట్టలో అసౌకర్యంగా అనిపించినా దానికి దూరంగా ఉండాలి. అలాగే సంభోగం తరువాత రక్తస్రావం అయినా కూడా వెంటనే వైద్యుడిని కలవాలి. ఆ పనికి దూరంగా ఉండాలి. ఏవైనా సెక్స్ వల్ల వ్యాపించే వ్యాధులు మీ భాగస్వామికి ఉన్నా కూడా దూరంగా ఉండాలి. లేకుంటే ఆ బ్యాక్టిరియాలు బిడ్డకు చేరవచ్చు.
Also read: మెరిసే చర్మం కోసం రోజూ వీటిని తాగండి చాలు, మెరిసే రంగు రూపం సొంతమైపోతుంది
Also read: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al