1893లో నిర్మాణం ప్రారంభం -1904 లో అందుబాటులోకి వచ్చిన టౌన్ హాల్ 
1929 ఏప్రిల్ 29న మహాత్మా  గాంధీ ప్రసంగించింది ఇక్కడి నుంచే 
ఉత్తరాంధ్ర ప్రజలను స్వాతంత్య్ర పోరాటం కోసం ఏకం చేసిన వేదిక
విదేశీ వస్త్ర బహిష్కరణకు ఊపిరి పోసిన వైజాగ్ టౌన్ హాల్ 
అప్పట్లోనే దీని నిర్మాణానికి 50 వేలు విరాళం ఇచ్చిన బొబ్బిలిరాజు 
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రినోవేట్ అవుతున్న టౌన్ హాల్ 
విశాఖలోని కంటైనర్ టెర్మినల్ కు ఎదురుగా.. ఠీవిగా నిలుచున్న టౌన్ హాల్ 
స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది త్యాగధనులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. అలాంటి వారి జ్ఞాపకాలు.. వారు తమ కార్యకలాపాలు సాగించిన పురాతన భవంతులు ఇప్పటికీ దేశంలోని పలుప్రాంతాల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది వైజాగ్ లో 1893 నుండి 1904 వరకూ నిర్మాణం పూర్తిచేసుకున్న టౌన్ హాల్. 100 ఏళ్లు పైగా చరిత్ర ఉన్న ఈ భవనం నుంచే ఉత్తరాంధ్ర ప్రజలను స్వాతంత్య్ర వీరులు జాగృతం చేసారు.

 


బొబ్బిలి రాజు విరాళంతో రూపొందిన టౌన్ హాల్
బ్రిటీష్ హయాంలో సాగరతీరంలో ఆఫీసర్లు సేదతీరడానికి, ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడానికి ఒక భవనం అవసరం అయింది. దానితో పాటు పట్టణం లోని పెద్దలు తమ సమావేశాలు నిర్వహించడానికి కూడా భవనం ఉండాలనే ఉద్దేశ్యంతో.. ఒకప్పుడు చెంగలరావు పేట పేరుతో పిలుచుకునే ప్రస్తుత వైజాగ్ పోర్ట్ లోని కంటైనర్ టెర్మినల్ ఉన్న ప్రాంతంలో టౌన్ హాల్ నిర్మాణం ప్రారంభించారు. దీనికి బొబ్బిలి రాజు 50 వేలు విరాళం ఇచ్చారు. 1893 లో ప్రారంభం అయిన నిర్మాణం సంక్లిష్టమైన దీని డిజైన్ కారణంగా 11 ఏళ్ళు కొనసాగి 1904 లో పూర్తి అయింది.భవన నిర్మాణం లో అధికభాగం నాణ్యమైన టేకు.. రోజ్ వుడ్ లను వాడారు. దీనిని అప్పటి కలెక్టర్ క్యాంబెల్ ప్రారంభించారు. బ్రిటీష్ అధికారులతోపాటు స్థానిక పెద్దమనుషులు కూడా ఈ భవనాన్ని తమ కార్యకలాపాలకు వినియోగించేవారు.


ఇక్కడి నుంచే మహాత్మా గాంధీ ప్రసంగం
స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడానికి.. ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ 28 ఏప్రిల్ 1929 న విశాఖ వచ్చారు. మరుసటి రోజు అంటే 29 ఏప్రిల్ న టౌన్ హాల్ నుండి ఉత్తరాంధ్ర ప్రజలను విదేశీ వస్త్రాలను బహిష్కరించాలంటూ ప్రసంగించారు. ఆ సంఘటన తరువాత అప్పట్లో నడిచిన స్వాతంత్య్ర ఉద్యమాలకు ఈ టౌన్ హాల్ వేదిక అయింది. ఇదే టౌన్ హాల్ ఎదురుగా ఉన్న బీచ్ లో గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు విశాఖకు చెందిన స్వాతంత్య్ర సమర యోధులు. 


స్వాతంత్య్ర వీరులు సందర్శించిన టౌన్ హాల్
రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి. రాజగోపాలాచారి, సర్ సీవీ రామన్ లతోపాటు ప్రముఖ సంగీత మేథావులు ఎంఎస్ సుబ్బలక్ష్మి, ద్వారం వెంకటస్వామి నాయుడు, బాలమురళీ కృష్ణ లాంటి వారు ఈ టౌన్ హాల్ ను సందర్శించిన వారిలో ఉన్నారు. గత కొంతకాలంగా ఎవరూ పట్టించుకోక పోవడం తో మరుగున పడ్డ టౌన్ హాలును మళ్ళీ పునరుద్ధరించారు. ఆఫీసర్ల కు ట్రైనింగ్ సెంటర్ గా, ప్రభుత్వ కార్యకలాపాల కోసం దీనిని ఉపయోగించబోతున్నారు. దాదాపు 120 ఏళ్ల  చరిత్ర గల ఈ టౌన్ హాల్ మళ్ళీ వినియోగం లోకి రావడంపై వైజాగ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.