భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు ఫిఫా షాకిచ్చింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)ని తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని FIFA ఉన్నత అధికారి మంగళవారం ప్రకటించారు. FIFA కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించి, థర్డ్ పార్టీల ప్రభావం పెరిగిపోయిందని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ తక్షణమే సస్పెండ్ చేశారు. మీడియాకు అధికారికంగా విషయాన్ని వెల్లడించారు.
ఫిఫా కీలక నిర్ణయం, వరల్డ్ కప్ జరుగుతుందా ?
FIFA U-17 మహిళల ప్రపంచ కప్ 2022, 2022 అక్టోబర్ 11-30 తేదీలలో భారతదేశంలో జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే షెడ్యూల్ ప్రకారం వరల్డ్ కప్‌లను నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సస్పెన్షన్ వల్ల భారత్‌లో అక్టోబర్ 11న ప్రారంభం కానున్న అండర్-17 మహిళల వరల్డ్ కప్ రద్దయ్యే అవకాశం ఉంది.
ఫిఫాతో కేంద్ర క్రీడలశాఖ చర్చలు !
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖతో FIFA సంప్రదింపులు జరిపింది. వారి వివరణ, చర్యలు తమకు సబబుగా అనిపించకపోవడంతో చివరకు ఫిఫా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. థర్డ్ పార్టీ జోక్యంతో ఫిఫా నిబంధనలకు ఏఐఎఫ్ఎఫ్ తూట్లు పొడుస్తుందని ఫిఫా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఫిఫాతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. చర్చలు ఫలించి, మహిళల ఫుట్ బాల్ వరల్డ్ కప్‌లకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చీకటి రోజు అంటూ నెటిజన్లు ఫైర్..
ఫిఫా తీసుకున్న నిర్ణయంతో భారతీయులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చీకటి రోజులు మొదలయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన ఘనంగా వేడుకులు జరుపుకుందని, ఆ మరుసటి రోజే దేశానికి ఫిఫా పెద్ద షాకిచ్చింది అని ఆవేదన వ్యక్తమవుతోంది. ముగింపునకు ఇది నాంది అని, మార్పులు తప్పనిసరిగా ఉండాలని.. అయితే దేశ ఫుట్ బాల్ ఫెడరేషన్‌ను, జట్టును నిషేధించడం ఏంటని సామాజిక మాధ్యమాలలో ప్రశ్నిస్తున్నారు. భారత ఫుట్ బాల్ చరిత్రలో అతిపెద్ద మార్పులు రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు, మెస్సేజ్‌లు, కామెంట్లు చేస్తున్నారు.