కర్రీ పాయింట్లలో దొరికే కూరలే ఎక్కువ మంది తినేవి. ఇంటి దగ్గర వండుకున్నా రొటీన్‌గా వంకాయ, దొండకాయ, బీరకాయ... ఇవే వండుతారు. అరటిపువ్వు, పుట్టగొడుగులు, పనసపొట్టు కూర... వంటివి చాలా తక్కువగా వండుకుంటారు. ఇక అరటిపువ్వు కూర అయితే ఎక్కడో వేయిమందిలో ఒకరు వండితే గొప్ప. ఒకప్పుడు ఈ కూర ఎంతో ఫేమస్. పండుగలకు, పబ్బాలకు గ్రామాల్లోని ప్రజలు ఈ కూరను వండుకునే వారు. అరటి పువ్వును పచ్చిగా తినలేరు. వండుకునే తినాలి.  వండడానికి ముందు పొరలను తీస్తుంటే అరటి పువ్వులు బయటపడుతుంటాయి, అలా పొరలు తీస్తున్న కొద్దీ పువ్వులు వస్తూనే ఉంటాయి. ఈ పువ్వులను ఎలా వండాలో తెలియకే చాలా మంది దీన్ని పట్టించుకోరు. అలాగే ఏ భాగాన్ని వండాలో, ఏది పడేయాలో కూడా చాలా మందికి తెలియదు. అందువల్లే ఈ పోషకాల అరటి పువ్వు కూర మరుగన పడిపోయింది. అరటిపువ్వుతో వండిన వంటలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?


1. అరటి పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని సాధారణ కూరగాయలాగే వండేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అరటికాయ వండి నట్టు అరటిపువ్వును కూడా  వండేసుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు కాస్త కూడా ఉండదు కాబట్టి అధిక బరువు తగ్గించే ప్రయాణంలో ఇది గొప్ప ఎంపిక.  
2. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అరటిపువ్వులోని పోషకాలు బాగా పనిచేస్తాయి. దీనిలో ‘మూసా సేపియంటం’ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. జంతువులపై చేసిన కొన్ని అధ్యయనాల్లో అరటిపువ్వులోని ఈ సమ్మేళనం కొలెస్ట్రాల్‌ను తగ్గించినట్టు గుర్తించారు. అయితే మనుషులపై ఈ అధ్యయనం జరుగలేదు. మానవులపై అదే విధంగా పనిచేస్తుందని, అధిక బరువు తగ్గుతుందని విశ్వసనీయంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 
3. మధుమేహులకు అరటిపువ్వుతో చేసిన వంటకాలు తినడం అత్యవసరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పువ్వులో ‘క్వెర్సెటిన్, కాటెచిన్’ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్ల శోషణను ప్రోత్సహించే ఎంజైమ్‌ను కూడా నిరోధిస్తాయి. 
4. పొట్ట ఆరోగ్యానికి అరటిపువ్వు వంటకాలు ఎంతో అవసరం. పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇది పేగులోని మంచి బ్యాక్టిరియాను ఆరోగ్యంగా ఉండే ప్రొబయోటిక్ గా పనిచేస్తుంది. 
5. ఎముకలు గట్టిగా, బలంగా ఉండాలంటే అరటిపువ్వును తరచూ తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలు త్వరగా దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో జింక్ కూడా ఉంటుంది. జింక్ కూడా ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. 


Also read: కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ


Also read: ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు 

























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.