దోమలంటే మనలో చాలామందికి భయం. అవి కుట్టినప్పుడు కలిగే బాధ కంటే.. అవి వ్యాప్తి చేసే వ్యాధులంటేనే ఎక్కువమందికి భయం. అందుకే, వీలైనంత వరకు ఇంట్లో దోమలు లేకుండా జాగ్రత్తపడతారు. అయితే, ఈ ఘటన గురించి తెలిస్తే దోమలు ఇలా కూడా ఉపయోగపడతాయా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆ దోమలు దొంగలను పట్టించాయి. ఔను నిజం, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇదిగో ఇలా.. 


సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం.. గత నెల జూన్ 11వ తేదీన ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఫుజౌలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి దొంగ చొరబడ్డాడు. బాల్కనీ నుంచి ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లోని వస్తువులను దొంగిలించడమే కాకుండా.. డిన్నర్ కూడా తయారు చేసుకున్నాడు. గుడ్లతో నూడుల్స్ వండుకుని తిన్నాడు. ఆ రాత్రి అక్కడే కాసేపు గడిపాడు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయాడు. దోమల బెడద ఎక్కువగా ఉండటంతో మస్కిటో కాయిల్స్ వెలిగించాడు. అయినా సరే దోమలు వెళ్లలేదు. అతడిని రాత్రంతా కుడుతూనే ఉన్నాయి. దీంతో విసుగొచ్చి చేతికి అందిన దొమను చంపుకుంటూ పోయాడు. 


తెల్లవారుజామున ఆ దొంగ నిద్రలేచి వెళ్లిపోయాడు. ఉదయం ఇంటికి వచ్చిన ఆ ఇంటి యజమాని బాల్కానీ తలుపులు తెరిచి ఉండటంతో తన ఇంట్లో చోరీ జరిగిందని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అన్నీ తనిఖీ చేశారు. అక్కడ వారికి చనిపోయిన దోమలు కనిపించాయి. గొడకు అతుక్కుని చనిపోయిన రెండు దోమల నుంచి వచ్చిన రక్తాన్ని పోలీసులు సేకరించారు. ఆ రక్తపు నమూనాలను టెస్టుల కోసం పంపారు. డీఎన్ఏ పరీక్షల్లో ఆ రక్తం ఎవరిదో తెలిసిపోయింది. 


Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్
 
దోమలో దొరికిన రక్తం డీఎన్ఏను నేరగాళ్ల డీఎన్‌ఏతో పోల్చి చూశారు. చివరికి చాయ్ అనే వ్యక్తి డీఎన్ఏతో అది మ్యాచ్ అయ్యింది. దీంతో పోలీసులు అనుమానితుడి గురించి గాలించేశారు. దొంగతనం జరిగిన 19 రోజుల తర్వాత పోలీసులు చాయ్‌ను అరెస్టు చేశారు. అతడిని పట్టుకున్న తర్వాత మరో మూడు దొంగతనం కేసుల్లో కూడా అతడే నిందితుడని తేలింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దోమలు ఇలా కూడా దొంగలను పట్టిస్తాయా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అతడి చేతిలో చనిపోయిన దోమలు.. ఇలా ప్రతీకారం తీర్చుకున్నాయని కొందరు కామెంట్ చేశారు. 


Also Read: ఇక్కడి ప్రజలు మనుషుల తలలను తినేస్తారు - ఎందుకో తెలిస్తే నిద్రపట్టదు!