పార్ట్‌టైం జాబ్‌ చేసుకుంటున్న ఆ యువతిని సోషల్‌ మీడియా సమస్యల్లోకి నెట్టేసింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి చిత్రవధ చేశాడు. చివరకు పోలీసుల జోక్యంతో నిందితుడి నుంచి తప్పించుకందాయువతి. 


గూడూరుకు చెందిన ఒక యువతి చదువుకుంటూనే పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. ఆన్‌లైన్‌లో తాను చేస్తున్న ఉద్యోగంలో భాగంగా ఓ యాప్‌ను ప్రమోట్ చేయాల్సి ఉంది. విధిలో భాగంగా తన ఫేస్‌బుక్‌ ఐడీ ద్వారా యాప్‌ను ప్రమోట్ చేసింది. దాన్ని చూసిన ఓ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ గణేష్‌ అనే వ్యక్తి తాను కూడా ప్రమోట్ చేస్తామంటూ ముందుకొచ్చాడు. అతనికి వికాస్‌ రామ్ అనే వ్యక్తి కూడా ఉత్సాహం చూపించాడు. వీళ్లిద్దరూ కొన్ని రోజుల క్రితమే పరిచయమయ్యాడు. 


గణేష్ చెప్పిన మాటలు పూర్తిగా నమ్మేసిన బాధిత యువతి తన పూర్తి వివరాలు ఇచ్చేసింది. యాప్ డౌన్లోడ్ చేయగానే ఓటిపి వస్తుందని ఆ ఓటీపీ తన నెంబర్‌ పంపించాలని ఫోన్ నెంబర్లు చెప్పింది. ఎన్నిసార్లు ట్రై చేసిన ఆ నెంబర్‌కు ఓటీపీ రావడం లేదని... వేరే నెంబర్ ఇవ్వాలని అడిగారు. తన ఫ్యామిలీలోని నెంబర్‌ ఇచ్చింది. 


తనకు కావాల్సిన ఫోన్ నెంబర్లు వచ్చాక... గణేష్‌ అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆ యువతి ప్రొఫైల్ ఫొటోపై బాధిత యువతి మొబైల్ నెంబర్‌తోపాటు వారి ఫ్యామిలీ నెంబర్స్‌ టైప్‌ చేసి కాల్‌గాల్‌గా అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. మొదట్లో కామెడీ చేస్తున్నాడని అనుకుంది బాధిత యువతి. కొన్ని సాంపిల్స్‌ పంపించాడు గణేష్. తన ఫ్రెండ్స్‌కు షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్స్‌ తీసి పంపించాడు. 


వాటిని చూసిన బాధితురాలు ఒక్కసారిగా కంగుతింది. చెప్పినట్టు చేయకుంటే తన ఫేస్‌బుక్‌ ఐడీలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. తాను చెప్పినట్లు చేస్తే వాటిని తొలగిస్తానని లేకపోతే అన్ని మిగతా గ్రూపులలో షేర్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. బయటకు చెబితే పరువు పోతుంది.. అతను చెప్పినట్టు చేస్తే సమస్య ఉండదు కదా అని గణేష్ చెప్పినట్టు చేసింది. అతనికి న్యూడ్‌గా వీడియో కాల్స్ చేసింది.


బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉంటూ చేసిన వీడియో కాల్స్‌ను కూడా రికార్డు చేసి మరింతగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈసారి డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేశాడు. పరిస్థితి తన చేయి దాటిపోయిందని గ్రహించిన  ఆ యువతి స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.


బాధితురాలి ఫిర్యాదు దిశా మహిళ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు ఎస్పీ. ఆ ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపగా విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడైన గణేష్ కేవలం ఈమెనే కాకుండా ఎంతో మంది యువతులను టార్గెట్ చేసుకొన్నట్టు తేలింది. అమ్మాయిలతో ముందుగా ఫేస్‌బుక్‌ ద్వారా సన్నిహితంగా ఛాటింగ్ చేసి, తదుపరి వారి ప్రొఫైల్ చిత్రాలను సేకరించి, వాటిని అసభ్యంగా చిత్రీకరించి, తాను చెప్పినట్లు నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని బెదిరించేవాడు. అలా వీడియో కాల్ చేసే సమయంలో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వీడియోలు రికార్డ్ చేసి, వాటిని చూపి డబ్బులు డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని బెదిరించేవాడు. ఫేస్‌బుక్‌ అకౌంట్స్‌ హ్యాక్ చేసి అమ్మాయిలు కావాలంటే ఈ ఫోన్ నెంబర్లకు కాల్‌ చేయాలంటూ మెసేజ్‌లు పంపిస్తాడు. అది కూడా అమ్మాయిల అకౌంట్స్‌ నుంచే ఈ పని చేస్తాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత పోలీసులు విచార‌ణ‌లో బాధితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చారు.


సామాజిక మాధ్యమాల వేదికగా అమ్మాయిలను అసభ్యంగా చిత్రీకరించి మోసాలకు పాల్పడుతున్న గణేష్‌ను అదుపులోనికి తీసుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతని ఫేస్ బుక్ ఐడి ద్వారా, నిఘా పెట్టి , బాధితురాలితోనే ఫోన్ చేయించి డబ్బు తీసుకోవడానికి రమ్మని పిలిపించి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈజీగా డ‌బ్బులు సంపాదనకు అలవాటు పడి, ఇతరుల ఫేస్‌బుక్‌ అకౌంట్లను హ్యాక్ చేసి అసభ్య సందేశాలు పంపించేవాడు. ఇలా చాలా మందిని మోసం చేశాడీ కేటుగాడు.