రణిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ అయ్యారు బానే ఉంది. కానీ..ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల్లో అధ్యక్ష 
పదవి చేపట్టటం అంత సులువేమీ కాదు. ఒకటి కాదు. రెండు కాదు. ఎన్నో సవాళ్లు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను 
చక్కదిద్దటమే కాకుండా, ప్రజల జీవన స్థితిగతులనూ మార్చే బాధ్యత ఆయనపైనే ఉంది. ఇక రాజకీయ స్థిరత్వం తీసుకురావటం మరో అతి పెద్ద ఛాలెంజ్. అప్పులు తీర్చటమైతే కత్తిమీద సామే. మరి ఈ సవాళ్లన్నింటినీ రణిల్ విక్రమసింఘే ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఈ సవాళ్లలో మొట్టమొదట చెప్పుకోవాల్సింది ప్రభుత్వ వ్యతిరేకత గురించే. ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వంపైన పీకల దాకా కోపం ఉంది. ఇప్పటి వరకూ ఉన్న పాలకులు తమ జీవితాల్ని అస్తవ్యస్తం చేశారన్న ఆగ్రహం, అసంతృప్తి వారిలో అగ్నిలా రగులుతోంది. అందుకే ఆ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఏకంగా ప్రధాని, అధ్యక్షుడి ఇళ్లనే ముట్టడించి ధ్వంసం చేశారు. 


ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటారా..? 


శ్రీలంక ప్రజలు చేస్తున్న డిమాండ్లలో "రణిల్ విక్రమసింఘే రాజీనామా" కూడా ఒకటి. ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిరసనలు చేపట్టారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏకంగా అధ్యక్ష పీఠాన్నే ఎక్కటం, వారిలో అసంతృప్తిని ఇంకా పెంచేదే. అసలు శ్రీలంక ప్రజలు రణిల్‌ విక్రమసింఘేను అధ్యక్షుడిగా అంగీకరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే. దేశానికి ఈ గతి పట్టటానికి కారణమైన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు అని బలంగా నమ్ముతున్నారు లంకేయులు. అలాంటప్పుడు ఆయన పరిపాలనను మాత్రం సమ్మతిస్తారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ సవాలు దాటటం రణిల్ విక్రమసింఘేకు కష్టతరమైన పనే. 


అన్ని అప్పులు ఎలా తీర్చుతారో..? 


శ్రీలంక పరిస్థితి ఇంతలా దిగజారటానికి ప్రధాన కారణం...విదేశాల నుంచి తీసుకున్న అప్పులు. ఈ మొత్తం 51 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రణిల్ విక్రమసింఘే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే చేయాల్సిన మొట్టమొదటి పనేదైనా ఉందంటే..అది IMFను అభ్యర్థించటమే. బెయిల్‌ అవుట్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటే తప్ప ఈ అప్పుల కుప్పల నుంచి శ్రీలంక బయటపడలేదు. అయితే ఈ ప్యాకేజ్‌ను IMFఅంత సులువుగా ఇచ్చే దాఖలాలైతే కనిపించటం లేదు. అవినీతిని అరికట్టటం సహా ఆర్థిక వ్యవస్థను కాస్త కుదురుకునేలా శ్రీలంక ఎన్నో చర్యలు చేపట్టాలని, అప్పుడు కానీ బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. 


ఇంధన కొరతనూ తీర్చుకోక తప్పదు...


చమురు కొరత శ్రీలంకను దారుణంగా వేధిస్తోంది. జూన్‌లో రెండు వారాల పాటు పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ఆపేయాల్సి వచ్చిందంటే ఆ దేశంలో కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షార్టేజ్ వల్ల ధరలు అమాంతం పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.450గా ఉంది. రణిల్ విక్రమసింఘే...వెంటనే ఈ ధరలు తగ్గించి ప్రజలందరికీ అందుబాటు ధరలకే పెట్రోల్, డీజిల్ విక్రయించేలా చర్యలు చేపట్టాలి. కానీ...చమురు దిగుమతులు సరిపడ డబ్బులు తమ వద్ద లేవని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.


మారక ద్రవ్య నిల్వలు పెంచాలి..


ప్రస్తుతం శ్రీలంక వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలతో మరో మూడు నెలలు మాత్రమే దిగుమతులు చేసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం  ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేసింది. యూఎస్ డాలర్ లావాదేవీలను తగ్గించటం సహా కెమికల్స్, వెహికిల్స్‌ దిగుమతులను నియంత్రించింది. అయితే ఈ దేశం నుంచి అయ్యే ఎగుమతులతో పోల్చితే..దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. రణిల్ విక్రమసింఘే ఫారెక్స్ నిల్వలను పెంచుకోవటం, దిగుమతులు తగ్గించుకోవటాన్ని బ్యాలెన్స్ చేస్తే తప్ప అప్పులు తీర్చటం అసాధ్యం. వీటితో పాటు పర్యాటక రంగానికి మళ్లీ అప్పటి వైభవం తీసుకురావటమూ కీలకమే. ఈస్టర్ దాడులు, కరోనా వ్యాప్తి, ఆర్థిక సంక్షోభం లాంటి కారణాలతో ఈ దేశానికి పర్యాటకులు రావటం బాగా తగ్గిపోయింది. ఆ మేరకు ఆదాయానికీ గండి పడింది. ఇప్పుడు దేశ పరిస్థితులు చక్కదిద్ది మళ్లీ పర్యాటక రంగంలో జోష్ తీసుకురావాల్సిన బాధ్యతను రణిల్ విక్రమసింఘే తీసుకోక తప్పదు.