వానాకాలం వచ్చిందంటే దోమలకు పండగే, ఎక్కడ పడితే అక్కడే నీరు నిల్వ ఉంటుంది. అందుకే ఆ కాలంలో అవి తీవ్ర రోగాలను కలుగజేస్తాయి. డెంగీ జ్వరం కూడా అధికంగా వచ్చేది ఈ కాలంలోనే. అందుకే డెంగీ ముప్పు ఇంకా పొంచే ఉందని చెబుతున్నాం. డెంగీ వచ్చిందంటే ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముందే తేరుకోవాలని సూచిస్తారు వైద్యులు. 


జ్వరం రాని డెంగీ...
డెంగీ వచ్చిన వారిలో మొదట కనిపించే లక్షణం తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు. కానీ కొందరిలో ఈ లక్షణాలు కనిపించవు. దాంతో డెంగీ అనే అనుమానం ఎవరిలో రాదు. కానీ శరీరంలో చేరిన వైరస్ మాత్రం ప్లేట్ లెట్లను నాశనం చేయడం మొదలుపెడుతుంది. అందుకే ఏమాత్రం నలతగా అనిపించినా వైద్యుల వద్దకు వెళ్లాలి. జ్వరం లేకుండా డెంగీ సోకడాన్ని అఫెబ్రిల్ డెంగీ అంటారు. 


డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి, ముసలి వారికి, చంటి పిల్లలకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్కన వారికి జ్వరం రాకుండా డెంగీ వైరస్ సోకచ్చు. అందుకే జాగ్రత్తగా పర్యవేక్షించాలి. పిల్లల్లో కూడా దాదాపు 20 శాతం మందికి జ్వరం లేని డెంగీనే వస్తుంది. 


 మిగతా లక్షణాలు
జ్వరం రాకపోయినా ఒళ్లు నొప్పులు రావడం, విపరీతంగా అలసిపోయినట్టు అనిపించడం, ఆకలి వేయకపోవడం, శరీరంపై దద్దుర్లు రావడం, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఎందుకైనా మంచిది డెంగీ పరీక్షలు చేయించుకోవడం మంచిది. లేకుంటే ఒక్కోసారి డెంగీని గుర్తించే సరికే పరిస్థితి చేయిదాటి పోవచ్చు. 


ఇలా జ్వరం రాకుండా డెంగూ ఎందుకు వస్తుంది? అంటే వైద్యులు చెబుతున్న కారణం ఇదే.. డెంగీ వైరస్ దోమకాటు వల్ల రక్తంలో చేరుతుంది. అదే చాలా తక్కువ పరిమాణంలో చేరితో జ్వరం రాదు. 


ఎన్ని నీళ్లు తాగితే...
డెంగీ వచ్చిందేమో అన్న అనుమానం వస్తే అధికంగా నీళ్లు తాగండి. నీళ్లను మించిన ఔషధం లేదు. నీళ్లు ఎంత అధికంగా తాగితే డెంగీ అంత త్వరగా బయటికి పోతుంది. విశ్రాంతి కూడా తగినంత తీసుకోవాలి. 


ఇప్పటికే వానలు దంచి కొడుతున్నాయి. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంట్లో దోమలు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.