డయాబెటిస్ ఉన్న వారికి ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం తినకూడదు? అనే విషయంలో కచ్చితంగా స్పష్టత కావాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అలాంటివి తినడం వల్ల డయాబెటిస్ పెరిగిపోతుంది. మధుమేహం పెరిగితే శరీరంలో ప్రధాన అవయవాలకు ముప్పు. ముఖ్యంగా కిడ్నీలు, కళ్లు , గుండె దెబ్బతింటాయి.అందుకే వారు ఏవైనా తినేముందు ఆ ఆహారం తినొచ్చా తినకూడదా తెలుసుకున్నాకే ఆరగించాలి. ఈ సీజన్లో అధికంగా దొరికే పండు పైనాపిల్. మధుమేహం ఉన్న పైనాపిల్ తినవచ్చా?
పైనాపిల్ తింటే ఏమవుతుంది?
డయాబెటిస్ రోగులు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలనే తినాలి. పండ్లలో కూడా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్నవే ఎంచుకోవాలి. పైనాపిల్ పండు తినే ముందు కాస్త సంయమనం పాటించాలి. ఆ పండు సువాసనకే నోరూరిపోతుంది. అలా అని అధికంగా తినేస్తే మాత్రం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. పైనాపిల్ పండ్లు అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి మితంగా ఒక ముక్క తిని ఆపేయాలి. రెండు మూడు ముక్కలు లాగిస్తే రక్తంల చక్కెర పెరిగి అసౌకర్యంగా అనిపిస్తుంది. పైనాపిల్ గ్లైసిమిక్ ఇండెక్స్ 51 నుంచి 73 మధ్య ఉంటుంది. అంటే ఎక్కువనే చెప్పాలి. అందుకే డయాబెటిస్ రోగులు రోజు మొత్తంలో వందగ్రాములకు మించి పైనాపిల్ తినకూడదు. అది కూడా ఒకేసారి కాకుండా గ్యాప్ ఇచ్చి తినాలి. తిన్న రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి.
నిజానికి మంచిదే...
డయాబెటిస్ వారికి పైనాపిల్ అంత మేలు చేయదు కానీ సాధారణ వ్యక్తులు మాత్రం పైనాపిల్ తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన పండు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ముందుంటుంది. శరీరంలో మంటలను, వాపును అణిచివేసేందుకు సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవడంలో పైనాపిల్‌లోని గుణాలు సహకరిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.