బైకైనా, కారైనా రిజిస్ట్రేషన్ తప్పని సరి. అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు బైకులంటే మోజే. అందులోనూ ఆటోమొబైల్ కంపెనీలు ఆడపిల్లల కోసం ప్రత్యేక డిజైన్లతో బైకులను మార్కెట్లో దించుతున్నారు. దీంతో సేల్స్ చాలా పెరిగాయి. ఢిల్లీలో ఉంటున్న ఓ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. కాలేజీకి వెళ్లేందుకు జంకాపురి నుంచి నోయిడా వరకు మెట్రోలో ప్రయాణించేది. రద్దీగా ఉండే మెట్రోలో ప్రయాణించలేక తనకెంతో ఇష్టమైన బైక్ కావాలని తండ్రిని అడిగింది. ఆమె తండ్రి ఒకంతట ఒప్పుకోలేదు.
ఏడాదిపాటూ తండ్రిని బతిమిలాడి చివరికి గత నెలలో బండి కొనుక్కుంది. బైకును రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ బండికి ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ అమ్మాయికే కాదు, ఆ కుటుంబానికే తలనొప్పిగా మారింది. చుట్టుపక్కల వాళ్లంతా ఆ బండి నెంబరు చూసి కామెంట్లు చేయడం, నవ్వుకోవడం చేస్తున్నారు. ఇక అమ్మాయి కాలేజీకెళుతుంటే దారిలో ఎంతో మంది ఆమెను చూసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆమెకు బండికి కేటాయించిన నెంబరు ఏంటంటే... ‘DL3 SEX ****’.
ఆ నెంబరు ప్లేటు బండికి ముందు, వెనుకా కూడా పెట్టించారు. దీంతో ఆ అమ్మాయి బండి నడిపేందుకే భయపడుతోంది. ఆకతాయిల మాటలు భరించలేక ఇంట్లో బైకు వదిలి మెట్రోలోనే ప్రయాణం చేస్తోంది. కుటుంబసభ్యులు ఢిల్లీ ఆర్టీవో అధికారులకు సమస్యను చెప్పి రిజిస్ట్రేషన్ నెంబరు మార్చేందుకు ప్రయత్నించారు. కానీ అది వీలుకాదని అధికారులు చెప్పినట్టు సమాచారం.
ఢిల్లీ రవాణా కమిషనర్ కెకె దహియా మీడియాతో మాట్లాడుతూ ‘ఒకసారి బండి నెంబర్ కేటాయించాక, దాన్ని మార్చడానికి ప్రస్తుతానికి ఎటువంటి నిబంధన లేదు’ అని తేల్చి చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు తాము ఇవ్వమని అవి ఆటోమేటిక్ గా ఒక సిరీస్ లో కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అయితే ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అభ్యంతరకర సిరీస్‌లను నిలిపివేసినట్టు చెప్పారు. కానీ ఆ అమ్మాయి బండి నెంబర్ మార్చడం మాత్రం కుదరదంటున్నారు. ఆమె ఆ బండిని అమ్మేసి కొత్తబండి కొనుక్కోవడమే మార్గం.
Read Also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read Also: కొత్త వేరియంట్ కమ్ముకుంటున్న వేళ... ఎవరికి బూస్టర్ డోస్ అవసరం?
Read Also: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి