ఒమిక్రాన్... కరోనా కొత్త వేరియంట్. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రపంచంపై పిడుగులా పడింది. మొదటిసారి దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ వ్యాపిస్తుందేమోనని ఇతర దేశాల ప్రజలు, ప్రభుత్వాలు భయపడుతున్నాయి. మనదేశంలో ఇంకా కొత్త వేరియంట్ కు సంబంధించి ఒక్క కేసు నమోదు కాలేదు కానీ భయాందోళనలు మాత్రం పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ పై మన టీకాలు అంత ప్రభావవంతంగా లేవని వార్తలు రావడంతో సహజంగానే ఆందోళన మొదలవుతుంది. అంతేకాదు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వాళ్లు బూస్టర్ డోస్ అవసరమా అని కూడా ఆలోచిస్తున్నారు.
ముంబైకి చెందిన ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ ఆగమ్ వోరా మాట్లాడుతూ ‘బూస్టర్ డోస్ వేయించుకోవాలా వద్దా అనే అంశం గురించి చర్చించడం కూడా చాలా అవసరం. ప్రస్తుతం వేసిన టీకాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్, మరణాలను అడ్డుకోవడంలో ప్రభావంతంగా పనిచేస్తున్పన్పటికీ, వైరస్ వ్యాప్తిని ఆపడంలో మాత్రం నూటికి నూరు శాతం ప్రభావవంతంగా పనిచేయవు. వ్యక్తి రోగనిరోధక స్థితిని పరీక్షిస్తే... బూస్టర్ డోస్ అవసరమో కాదో తెలుస్తుంది’ అని అన్నారు.
ఎవరికి అవసరం?
కొంతమందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికి బూస్టర్ డోస్ అవసరం పడుతుంది. అలాగే రేడియోథెరపీ, కీమోథెరపీ, స్టెరాయిడ్లు, ఇతర ఇమ్యునోసప్రెసెంట్స్ తీసుకునే వ్యక్తులు, 65 ఏళ్లు పైబడిన వయసు కలిగిన వ్యక్తులు, మధుమేహ రోగులు, దీర్ఘకాలిక వ్యాధులైన మూత్రపిండ, కాలేయ వ్యాధి రోగులుకు బూస్టర్ డోస్ అవసరం పడొచ్చు. అలాగే రోగుల మధ్య నిత్యం తిరిగే హెల్త్ కేర్ వర్కర్లకు కూడా బూస్టర్ డోస్ వేస్తే మంచిది.
ఒమ్రికాన్‌ను చూసి భయపడాలా?
ఈ వేరియంట్ గురించి బయటపడి వారమే అయ్యింది. వ్యాప్తి చెందే రేటు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. అయితే ఇప్పటివరకు ఒమ్రికాన్ వల్ల పెరిగిన మరణాల గురించి మాత్రం స్పష్టమైన నివేదికలు లేవు. ఇది ప్రపంచంపై మళ్లీ విరుచుకుపడే వేరియంటా కాదా అని తేల్చలేకపోతున్నారు వైద్యులు. ఎందుకంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా దాని క్లినికల్ ప్రొఫైల్, దాని తీవ్రత, వ్యాప్తి అర్థం చేసుకోవడానికి ఒక నెల పడుతుంది. టీకా రోగనిరోధక శక్తితో లేదా మోనోక్లోనల్ రోగనిరోధక శక్తితో ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడానికి మరొక నెల పడుతుంది. కాబట్టి ఒమ్రికాన్ గురించి పూర్తిగా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది.
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు