సిరివెన్నెల సీతారామ శాస్త్రి... తెలుగు పాటల పూదోటలో పారిజాతం ఆయన పాట. ఎన్నిసార్లు విన్నా ఆ పదాల కలయిక మనల్ని మళ్లీమళ్లీ పాట వినమని మనసును లాగుతూనే ఉంటుంది. ఆయన పాటలు వినివిని సాంత్వన పొందిన మనసులు ఎన్నో. అందుకే ఆయనకు అభిమానులు ఎందరో.  తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడంలో సిరివెన్నెల పాత్ర ముఖ్యమైనది. అలాంటి వ్యక్తి ఇప్పుడు లోకాన్ని విడిచి వెళ్లి తెలుగు సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచారు. గత కొన్ని రోజులుగా ఆయన నిమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజులుగా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. కేవలం ఎక్మోపైనే ఆయన ప్రాణం నిలిచినట్టు చెప్పారు వైద్యులు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు స్టార్ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కూడా చివరి రోజుల్లో ఎక్మోపై కొన్ని రోజుల పాటు గడిపారు. పరిస్థితి చేయి దాటినప్పుడు వైద్యులు ప్రాణం నిలిపేందుకు వాడే ఆరోగ్య పరికరం, పద్దతి ‘ఎక్మో’. ఈ పరికరమే నాలుగు రోజుల పాటూ సిరివెన్నెల ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ECMO అంటే ‘ఎక్స్ ట్రాకార్పోరీల్ మెంబ్రేన్ ఆక్సిజెనేషన్’. 


ఏమిటీ ఎక్మో...
ఎక్మో అనేది ఒక అధునాతన పరికరం. గుండె, ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేక ఆగిపోయే పరిస్థితుల్లో ప్రాణం నిలిపేందుకు ‘ఎక్మో’ పద్దతిని అనుసరిస్తారు వైద్యులు.  అందుకే ఎక్మో ను ప్రాణ రక్షణ పరికరంగా పిలుస్తారు. నిమోనియా, ఊపిరితిత్తులు క్యాన్సర్, సీవోపీడీ (క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) విషమించినప్పుడు రోగి స్వయంగా శ్వాస తీసుకోలేరు. అలాంటి సందర్భంలో ఎక్మో ఆ బాధ్యతను తను తీసుకుంటుంది. శరీరంలో రక్త ప్రసరణ జరిగేలా, శ్వాస ఆడేలా చేస్తుంది. 


ఎలా పనిచేస్తుంది?
ఎక్మో పద్దతిలో రెండు రకాలున్నాయి. ఊపిరితిత్తుల మాత్రమే పనిచేయడం ఆగిపోతే ‘వీనో వీనస్’ పద్ధతిని అనుసరిస్తారు. అదే గుండె, ఊపిరితిత్తులు రెండూ పనిచేయకపోతే ‘వీనో ఆర్టీరియల్’పరికరాన్ని వినియోగిస్తారు. రోగి మెడ మీద చిన్న కోత ద్వారా ఎక్మో పరికరానికి చెందిన ఒక ట్యూబ్‌ను రక్త నాళాలైన సిర లేదా ధమనుల్లోకి చొప్పిస్తారు. ఇది రోగి శరీరంలోని రక్తాన్ని గుండెలానే పంపింగ్ చేస్తుంది. ఆక్సిజన్ అందేలా చేస్తుంది. దీని వల్ల గుండె, ఊపిరితిత్తులు పనిచేయకపోయినా ప్రాణం నిలబడుతుంది. అంతేకాదు కార్బన్ డైయాక్సైడ్ ను బయటకు తీసే బాధ్యత కూడా దీనిదే. శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గకుండా చూసుకుంటుంది.


ఎన్నిరోజులు ఎక్మోను వినియోగించవచ్చు?
రోగి పరిస్థితి విషమంగా ఉన్నప్పుడే ఎక్మోను వినియోగిస్తారు. అయితే దీనిపై ఏడు నుంచి పదిహేను రోజుల వరకు రోగిని ఉంచుతారు. ఈలోపు వైద్యులు అతని గుండె, ఊపిరితిత్తులను తిరిగి సాధారణంగా పనిచేసేలా చేయాలి. నెలలపాటూ ఎక్మోపైనే ఉంచడం మాత్రం కుదరని చెబుతున్నారు వైద్యులు.


Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
Also Read: 'సిరివెన్నెల'కు ముందు సీతారామ శాస్త్రి జీవితం ఇదీ...


Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!


Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..