సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుందంటే అందుకు కారణం ఆపాటలో సాహిత్యం. అలాంటి పాటల్లో తప్పనిసరిగా చోటుదక్కించుకునే పాట సిరివెన్నెల సినిమాలో విరించినై విరచించితిని ఈ కవనం పాట. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్ర కలం నుంచి జాలువారిన మొదటిపాట.
తెలుగు భాషపై మంచి పట్టుండడంతో MA చదువుతుండగానే సిరివెన్నెలకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు విశ్వనాథ్. ఆ నమ్మకాన్ని ఎంతలా నిలబెట్టుకున్నారంటే ఆయన రాసిన తొలిపాటకే నంది అందుకునేంతగా. మొదటగా రాసిన పాటే ‘విధాత తలపున ప్రభవించినది’. ఈపాట రాసేందుకు వారం రోజులు సమయం పట్టింది.
ఆపాట ఇక్కడ చూడండి.
పాటకు అర్థం ఇదే..
విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క
తలపున = ఊహలో
ప్రభవించినది = మెరిసినది
అనాది = మొదలు లేని
జీవన వేదం = ఈ సృష్టికి మూలమైన వేదం
ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో
స్పందన నొసగిన = ఆ ప్రాణాన్ని తట్టి లేపిన
ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము
కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే
ప్రతిబింబించిన = ఆ కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం = ఈ సృష్టి యొక్క రూప ఆవిష్కరణ
ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో
ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన
విరించి = బ్రహ్మ యొక్క
విపంచి = వీణ
గానం = సంగీతం
సరస = నవరసాలు
స్వర = సంగీత స్వరం
సురఝరీ = దేవనది, గంగ
గమనమౌ = ప్రవాహము ఐనట్టి
సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది
నే పాడిన జీవన గీతం ఈ గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం
విరించినై = నేనే బ్రహ్మనై
విరచించితిని = రచించితిని
ఈ కవనం = ఈ కవిత్వం
విపంచినై = వీణనై
వినిపించితిని = వినిపిస్తున్నా
ఈ గీతం - ఈ పాట
ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద
దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ
జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు
వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద
పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు
స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట
జగతికి = ప్రపంచానికి , విశ్వానికి
శ్రీకారము కాగా = మొదలు కాగా
విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి
ఇది భాష్యముగా = వివరణగా
జనించు = పుట్టిన
ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన
జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల
చేతన = చైతన్యం, అచ్తివషన్
ధ్వనించు = శబ్దం
హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.
అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న
ఆది తాళం = ఆది తాళం
అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా
సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం
నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట