ఉత్తర భారత దేశంలో రోటీలు, చపాతీలు, పరోటాలకు ఎంతో డిమాండ్. వారి ప్రధాన ఆహారం ఇదే. చపాతీతో పాటు పప్పు, కూరలు, మాంసాహారాలు జతగా లాగిస్తారు. గోధుమపిండి, నీరు... ఈ రెండు పదార్థాలతోనే తయారయ్యే చపాతీకి అభిమానులు ఎక్కువే. అయితే గుండ్రంగా, మెత్తగా ఉండే ఈ చపాతి ఒకప్పుడు బ్రిటిష్ వారిని  భయపెట్టింది. ‘చపాతి మూమెంట్ 1857’ గా చరిత్రకు ఎక్కింది. 


పెద్ద ఉద్యమమే
1857లో ఈ చపాతీ ఉద్యమం ఆగ్రా సమీపంలోని మధుర ప్రాంతంలో పుట్టినట్టు చెబుతారు. స్వాతంత్య్ర భారతం కోసం పోరాడుతున్న నిరసనకారులు సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న వారి కోసం చపాతీలు తయారుచేసి, పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చపాతీల పంపిణీ కేవలం రాత్రి పూట లేదా తెల్లవారుజామున జరిగేది. గ్రామ చౌకీదారులు, స్థానిక పోలీసులు కూడా ఈ పంపకాలలో భాగమయ్యారు. 90 వేల మందికి పైగా భారతీయ సైనికులు ఈ చపాతి పంపిణీలో చేరారు. చపాతీలు ఇళ్లకు రాత్రిపూట మాత్రమే పంపిణీ చేసేవారు. ఈ చపాతీలను స్వీకరించిన ప్రజలు, మరిన్ని చపాతీలను తయారు చేసి వారి పొరుగు గ్రామాలకు పంపించేవారు. ఇలా చపాతీల ఉద్యమమే సాగింది. దీంతో బ్రిటిష్ అధికారులకు అనుమానం వచ్చింది. 


మధురలో మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న మార్క్ తార్న్ హిల్ ఈ చపాతీల పంపకంపై విచారణ చేశారు. ప్రతిరోజు రాత్రి 300 కిలోమీటర్లకు పైగా ఇవి రవాణా అవుతున్నాయని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో చపాతీలు అకస్మాత్తుగా ఎందుకు పంపిణీ అవుతున్నాయని ఆయనకు అనుమానం వచ్చింది . ఎంత విచారణ చేసినా కారణాలు తెలియలేదు. చపాతీల్లో ఏవో రహస్య సంకేతాలు ఉన్నాయని, సందేశాలు ఉన్నాయని, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీటిని వాడుతున్నారని అనుమానించారు. చపాతీలను చింపి ముక్కలు చేసి చూసినా... వారికి ఏమీ దొరకలేదు. కొంతమంది మాత్రం ఈ చపాతీ ఉద్యమం అనేది ప్రజలను సమీకరించి, వారిని సంఘటితం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఒక మార్గం అని అంటారు. 


మే 10న మీరట్లో ప్రారంభమైన ‘1857 సిపాయిల తిరుగుబాటు’కు పునాది ఈ చపాతీ ఉద్యమమే అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ  రోటీ ఉద్యమం గురించి ఫతేపూర్ కలెక్టర్‌గా అప్పట్లో పనిచేసిన జె డబ్ల్యూ షేరర్ తన ‘డైలీ లైఫ్ డ్యూరింగ్ ది ఇండియన్ మ్యుటీని’ అనే పుస్తకంలో రాశారు.  ఏదేమైనా మెత్తటి చపాతీ ప్రజలను ఏకం చేయడంలో అప్పట్లో కీలక పాత్ర పోషించదని చెప్పుకోవచ్చు.


Also read: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? దానికి ఇవి కూడా కారణాలు కావచ్చు




Also read: డయాబెటిస్ ఉన్నవారు చెరుకు తినవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.