డయాబెటిస్ ఒక్కసారి ఒంట్లో చేరిందంటే ఇక జీవితాంతం జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా ఆహారం విషయంలో ఆచితూచి అడుగేయకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చక్కెర లేని పదార్థాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకొని తినాలి. లేకుంటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగి అనేక సమస్యలు వస్తాయి. డయాబెటిస్ బారిన పడిన వారిలో కొన్ని సందేహాలు ఉంటాయి. అందులో ఒకటి  చెరుకు తినడం లేదా చెరుకు రసం తాగడం మంచిదేనా అని. ఈ కథనంలో డయాబెటిస్ రోగులు చేరుకు తినవచ్చా లేదా అనే విషయం తెలుసుకుందాం.


చెరుకు భారతదేశం, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట. ఇక్కడ చాలా చోట్ల ప్రధాన పంట కూడా చెరుకే. చెరుకుతో చక్కెర, బ్రౌన్ షుగర్, మోలాసిస్, బెల్లం వంటివి తయారు చేస్తారు. కొన్నిచోట్ల ఈ చెరుకుతో మద్యంలో ఒక రకమైన రమ్‌ను కూడా తయారు చేస్తారు. బ్రెజిల్‌లో చెరుకును పులియబెట్టి ‘కాచాకా’ అనే మద్యాన్ని తయారు చేస్తారు. చెరుకు రసంలో ఉండే చక్కెర స్వచ్ఛమైనది కాదు. ఈ చక్కెర సూక్రోజ్ రూపంలో 70 నుంచి 75% వరకు ఉంటుంది. నీరు 10 నుంచి 15 శాతం, ఫైబర్ 13 నుంచి 15శాతం కలిగి ఉంటుంది. నేరుగా తినడం వల్ల ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోకి చేరుతాయి. అవి మన శరీరానికి అత్యవసరమైనవి కూడా. అలాగే విటమిన్లు, ఖనిజాలు కూడా దానిలో పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్నందున ఇది మంచి హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. వ్యాయామం చేశాక చెరుకు రసం తాగడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే చెరుకు లేదా చెరుకు రసం అనేది డయాబెటిస్ లేనివారికి వరమనే చెప్పాలి. కానీ డయాబెటిస్ ఉన్న వారికి మాత్రం చెరుకు అంత మంచి ఎంపిక కాదు.


డయాబెటిస్ ఉంటే...
చెరుకు రసం తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. అలా అని డయాబెటిక్ రోగులు దాన్ని తాగకూడదు. దానిలో గ్లైసిమిక్ లోడ్ అధికంగా ఉంటుంది. అంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పై ఇది అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. సుక్రోజ్ కూడా చక్కెరకు మరో రూపమే. అందుకే మధుమేహం ఉన్నవారు చెరుకును లేదా చెరుకు రసాన్ని తరచూ తాగకూడదు. భారీ మొత్తంలో చక్కెర రక్తంలో చేరే అవకాశం ఉంది. అలాగని దీన్ని పూర్తిగా మానేయమని కూడా సూచించడం లేదు. అప్పుడప్పుడు దీన్ని తినవచ్చు. అయితే బయట చెరుకు రసం కొనేటప్పుడు దానిలో పంచదార కలిపి ఇస్తుంటారు వ్యాపారులు. కాబట్టి చెరుకు రసంలో పంచదార కలపకుండా స్వచ్ఛమైనది మాత్రమే తాగాలి. అలా అని డయాబెటిక్ రోగులు తరచూ తాగకూడదు, మూడు నాలుగు నెలలకు ఒకసారి తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదు. 



Also read: బ్రష్ చేసేటప్పుడు ఈ లక్షణం కనిపిస్తే కాలేయ వ్యాధి ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం 







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.