శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన అవయవం. మన శరీరంలో 500 కంటే ఎక్కువ శారీరక విధులను నిర్వహించేది ఈ అవయవమే. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడం, మన రక్తం నుండి వ్యర్ధాలను, విష పదార్థాలను తొలగించడం వంటి చాలా ముఖ్యమైన పనులు కాలేయం చేస్తుంది. కాలేయ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాలేయ వ్యాధులు ఏమైనా వస్తే అవి తీవ్రంగా మారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. కాలేయానికి వచ్చే వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదకరమైనది. ఇది రెండు రకాలు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మధ్యపానం తాగే వారిలో వచ్చేది ‘ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’.  మద్యపానం అలవాటు లేని వారిలో వచ్చేది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’. ఈ రెండు వ్యాధులు తీవ్రమైన దశకు చేరుకుంటే ఆ పరిస్థితిని ‘లివర్ సిరోసిస్’ అంటారు.


సిరోసిస్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన పరిస్థితి. అందులో తీవ్రమైన దశకు చేరుకుంటేనే దాన్ని సిరోసిస్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి వస్తే వెంటనే లక్షణాలు కనిపించవు. కొన్ని సంవత్సరాల పాటు కాలేయం వాపుకు గురవుతుంది. మచ్చలు ఏర్పడి, ముద్దగా కుచించుకుపోతుంది. కాలేయం దెబ్బతినడం వల్ల ఆరోగ్యకరమైన కణజాలం స్థానంలో మచ్చలున్న కణజాలం ఏర్పడుతుంది. కాలేయం తన విధులను నిర్వర్తించలేదు. చివరికి పూర్తిగా వైఫల్యం చెందుతుంది. దీన్నే కాలేయ వైఫల్యం అంటారు. ఆ సమయంలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. 


బ్రష్ చేస్తున్నప్పుడు...
కాలేయం ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడితే దంతాలు తోముకునేటప్పుడు ఒక లక్షణం కనిపిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుంటే అది ఫ్యాటీ లివర్ వ్యాధి తీవ్రమైన దశలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ముక్కునుండి రక్తస్రావం కనిపించినా, దంతాలు ఊడిపోతున్నా, దంతాలు చుట్టూ ఉన్న చిగుళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడినా కూడా తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇవి కాలేయ వ్యాధికి ప్రధాన సంకేతాలుగా చెప్పుకోవచ్చు.


ఇవి కూడా లక్షణాలే..
కాలేయం సరిగా పని చేయకపోతే, ఆకలి లేకపోవడం, వికారంగా అనిపించడం, చర్మంపై దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కూడా కాలేయ ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం అవసరం. అలాగే పచ్చ కామెర్లు వచ్చినా, రక్తపువాంతులు అయినా, నల్లగా తారులాగా మల విసర్జన జరిగినా, కాళ్లు, పొత్తికడుపులో నీళ్లు చేరుకుపోయినా, అలసటగా అనిపించినా, బలహీనంగా అనిపించినా, బరువు అకస్మాత్తుగా తగ్గినా, కండరాలు క్షీణించినా కూడా కాలేయ వ్యాధేమో ఓసారి చెక్ చేయించుకోవాలి. 


Also read: ఈ మూడు పప్పులు కలిపి గారెలు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది






































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.