డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఫైనాన్సియర్ల ఆగడాలు ఎంతలా శ్రుతిమించాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటున్నారు స్థానిక ప్రజలు. తీసుకున్న మోటార్ బైక్ ఈఎంఐ చెల్లించలేదని ఓ వ్యక్తినే ఎత్తుకెళ్లారు ఫైనాన్సియర్‌లు. భయంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.
అమలాపురంలో నివసించే రవీంద్ర స్థానికంగా ఉండే పూజిత మోటార్ బైక్ ఫైనాన్స్ కంపెనీ వద్ద లోన్‌పై టూవీలర్ తీసుకున్నారు. ఈఎంఐలు రెండు నెలలుగా చెల్లించడం లేదని రవీంద్రను ఎత్తుకెళ్లిపోయారు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు. ఇంట్లో కూడా సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లిపోయి నిర్బంధించారు.
12వేల రూపాయలు చెల్లించిన తర్వాత విడిపిస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే మొత్తం చెల్లిస్తామని చెప్పినా కంపెనీ ప్రతినిధులు వినలేదట. విషయం తెలుసుకున్న రవీంద్ర భార్య శిరీష టెన్షన్ పడ్డారు. గర్భిణిగా ఉన్న ఆమెకు భర్తను ఎక్కడి తీసుకెళ్లారో తెలియక ఆందోళన పడింది.
చివరకు ఎవరూ స్పందించకపోవడంతో అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త రవీంద్ర పైనాన్స్ కంపెనీలో మోటార్ బైక్ తీసుకుని రెండు నెలలకు ఈఎంఐ చెల్లించలేదని తెలిపారు. రెండు నెలలకు రూ.12 వేలు బకాయి పడ్డారని వివరించారు. అయితే కొద్ది రోజుల్లో మొత్తం నగదు చెల్లిస్తామని ఫైనాన్స్ కంపెనీ చెప్పామన్నారు. అయినా వాళ్లు వినిపించుకోలేదని వాపోయారు. నిర్దాక్షణ్యంగా తన భర్తను తీసుకు వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాము అమలాపురం ముస్లిం వీధిలో అద్దెకు ఉంటున్నామని ,తాను ఎనిమిదో నెల గర్బిణీనని తమకు న్యాయం చెయ్యాలని శిరీష కోరారు. దీనిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకొని ఫైనాన్స్ సిబ్బందిని పిలిచి మాట్లాడారు.