Rat Fever: రుతుపవనాలు రావడంతోనే సీజనల్ ఫ్లూ, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా వెంట వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వర్షాకాల అలెర్జీలు... ఇవన్నీ కూడా తడిగా ఉండే వానాకాలంలోనే వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే డెంగ్యూ, మలేరియాలు కూడా వానాకాలంలోనే అధికంగా సోకుతాయి. ఈ ఏడాది కేరళలో ర్యాట్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ర్యాట్ ఫీవర్ ను లెఫ్టోస్పిరోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది జంతువులలో ఉద్భవించే ఒక అరుదైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకలు, కుక్కలు వంటి వాటి మలం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది ప్రమాదకరమైనదే కానీ ప్రాణాపాయం మాత్రం తక్కువని చెబుతున్నారు వైద్యులు. కేరళలో దాదాపు 50 వేల మందికి పైగా ర్యాట్ ఫీవర్ బారిన పడినట్టు తెలుస్తోంది.


దీని లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రోగాలు పాకడం అంత కష్టమేమీ కాదు. ఈ ర్యాట్ ఫీవర్ సోకాక వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొన్ని రోజుల తర్వాత వికారంగా అనిపించడం, వాంతులు కావడం, పొత్తు కడుపు నొప్పి రావడం, అతిసారం, తలనొప్పి, తీవ్ర జ్వరం, కామెర్లు, కళ్ళు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి సమయానికి చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఇది మూత్రపిండాల పైనే నేరుగా ప్రభావం చూపిస్తుంది. అలాగే మెనింజైటిస్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాలేయం వైఫల్యం చెందవచ్చు. శ్వాసకోశ బాధలు కూడా రావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స చేయకపోతే చివరికి మరణం సంభవించే అవకాశం ఉంది.


ఈ జ్వరం ఒక్కసారి సోకితే మూడు రోజుల నుండి రెండు వారాల వరకు ఉండే అవకాశం ఉంది.  వానాకాలంలో ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇంట్లోనే చికిత్స తీసుకోవడం వంటివి చేయకూడదు. పరిస్థితి చేయి దాటే వరకు రావచ్చు. అలాగే కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పంపు నీరును ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి, చల్లార్చి అప్పుడు తాగాలి. చేతులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలను బాగా కడిగాకే తినాలి. మీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వలు ఉంటే దోమలు చేరి అనేక జ్వరాలకు కారణం అవుతాయి. నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.


Also read: వానాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయ కాంటోలా, అదేనండి ఆకాకరకాయ



Also read: వజ్రాల కన్నా విలువైన టమోటో విత్తనాలు, కిలో ఎన్ని కోట్ల రూపాయలంటే











































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.