Gold Investment vs Physical Gold : అక్షయ తృతీయకు బంగారం కొనే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా గోల్డ్ కొంటే మంచిదని భావించి ఎక్కువమంది గోల్డ్ కొనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. కలలో కూడా ఊహించని విధంగా బంగారం పరుగులు పెడుతూ లక్ష మార్కును చేరుకుంది. ఈ సమయంలో గోల్డ్ కొనాలంటే సామాన్యుడికి కష్టంగా మారింది. అది సరిపోదన్నట్టు అక్షయ తృతీయ కూడా వచ్చేసింది.

బంగారం లక్ష రూపాయలకు చేరుకున్నా.. కొందరు మాత్రం మరికొన్ని రోజుల్లో దానిరేటు చాలా ఎక్కువగా తగ్గుతుందని చెప్తున్నారు. మరికొందరేమో గోల్డ్ రేట్ అక్కడే ఉంటుందని.. మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు. గోల్డ్ రేట్ తగ్గితే.. ఇప్పుడు గోల్డ్ కొనడం కాస్త రిస్క్​తో కూడిన విషయవుతుంది. ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగితే కాస్త లాభం ఉండొచ్చు కానీ.. పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేము. మరి ఇలాంటి సమయంలో గోల్డ్ కొంటే మంచిదా? లేదా ఇన్వెస్ట్​మెంట్​ చేస్తే మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?

బంగారం కొంటే.. 

బంగారాన్ని నగలు, బిస్కెట్లు, ఇతర రూపాల్లో కొంటే ఆస్తి మీ చేతిలో ఉందని అనిపిస్తుంది. గోల్డ్ కొనడం ఎప్పటికైనా మంచిదే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు విలువ తగ్గినా రేపు విలువ పెరుగుతుంది. పండుగలు, పెళ్లిళ్లు ఇతర సమయాల్లో మీ లుక్​ని మరింత ఎలివేట్ చేస్తుంది. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు డబ్బుకోసం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 

డిజిటల్ ఇన్వెస్ట్​మెంట్​లు అంతగా తెలియని వారికి ఇది మంచి ఆప్షన్. ఆభరణాలు ధరించే వారు గోల్డ్ కొనడమే మంచిది. కాకపోతే భద్రతా తక్కువ. సరైన ప్లేస్​లో ఉంచకపోతే ఎవరైనా దొంగిలించే అవకాశముంది. 

గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్.. 

మీకు ఇన్వెస్ట్​మెంట్​ మీద ఇంట్రెస్ట్ ఉంటే.. అధిక లాభాల కోసం గోల్డ్​పై పెట్టుబడి పెట్టొచ్చు. అంటే గోల్డ్ ఈటీఎఫ్​లు, గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్​పై ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్​మెంట్​ వల్ల భద్రతా సమస్యలు ఉండవు. బంగారాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉండదు. సులభంగా కొనొచ్చు. లాభాలు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. ఆన్​లైన్​లో ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చు. నగలు చేయిస్తే మేకింగ్ చార్జీలు ఉంటాయి. దీనికి ఆ ఛార్జ్ ఉండదు. సావరిన్ గోల్డ్ బాండ్​లు వార్షిక వడ్డీని కూడా ఇస్తాయి. వీటిని 8 సంవత్సరాలు ఉంచితే లాభాలపై ట్యాక్స్ ఫ్రీ. దీనివల్ల పన్ను మినహాయించుకోవచ్చు. మార్కెట్ ధర ఆధారంగా ట్రేడింగ్ ఉంటుంది. 

బంగారం కొనడం vs గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్

మీ అవసరాలకు అనుగుణంగా బంగారాన్ని కొనుక్కోవచ్చు. లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ చేయవచ్చు. అయితే నిపుణులు ఇచ్చే సలహా ఏంటి అంటే రెండు రూపాల్లో కూడా గోల్డ్​ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంటే పూర్తిగా గోల్డ్ కొనడం లేదా పూర్తిగా గోల్డ్​పై ఇన్వెస్ట్ చేయడం కంటే కొంత డబ్బుతో బంగారం కొని.. మరికొంత ఇన్వెస్ట్​మెంట్​కి ఉపయోగిస్తే మంచిదంటున్నారు. మరి ఈ అక్షయతృతీయకు మీరు గోల్డ్ కొంటారో.. ఇన్వెస్ట్​మెంట్ చేస్తారో.. లేదా రెండూ ప్లాన్ చేసుకుంటారో.. గోల్డ్ రేట్ తగ్గేవరకు వేచి చూస్తారో పూర్తిగా మీ ఇష్టమే.