Kantola: ఈ కూరగాయను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొంతమంది ఆకాకరకాయ అంటారు. మరికొందరు ఆగాకర అని కూడా పిలుస్తారు. అడవి కాకర, బోడ కాకర అని కూడా ఈ కూరగాయను పిలుచుకుంటారు. ఇది కాకరకాయ జాతికి చెందినది. పొట్టిగా, గుండ్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్రాల్లో అధికంగా దీనిని తింటారు. కాకరకాయతో పోల్చితే దీనిలో ఎలాంటి చేదు ఉండదు. కేవలం వానాకాలంలో మాత్రమే ఇది దొరుకుతుంది. అందుకే దీన్ని రుతుపవనాలు తెచ్చే కూరగాయగా చెప్పుకుంటారు. దీన్ని కచ్చితంగా వానాకాలంలో తినాల్సిందే. ఎందుకంటే ఇది ఒక సీజనల్ కూరగాయ. ఈ సీజన్లో మనకు వచ్చే వ్యాధులను అడ్డుకునే స్వాభావిక సామర్థ్యం దీనిలో ఉంటుంది. దీన్ని కాంటోలి అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో స్పైన్ గార్డ్ అంటారు. ఇది ఔషధ ఆహారాల కేటగిరీ కిందకే వస్తుంది. అందుకే వానాకాలంలో ప్రతివారం ఒక్కసారి అయినా దీన్ని తింటే ఎంతో ఆరోగ్య కరం.


వానాకాలం వచ్చేసరికి ఎన్నో అంటు వ్యాధులు, జలుబు, ఫ్లూ వంటివి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. వాటిని దూరంగా ఉంచాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సీజనల్‌గా దొరికే కూరగాయలు, పండ్లు ఆయా కాలాలలో వచ్చే రోగాలను అడ్డుకోవడానికి సహాయపడతాయి. అలాంటి మాన్‌సూన్ వెజిటబుల్ ఆగాకరకాయ. ఇది ఉబకాయాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికం. అలాగే డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం అంటే ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి9 అంటే ఫొలేట్ అధికంగా ఉంటుంది. ఇనుము, మెగ్నీషియం వంటివి ఎక్కువగా లభిస్తాయి. దీనిలో ఉండే క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియకు ఎంతో సహకరిస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.


దీనితో ఉండే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. దీని తొక్కపై చిన్న ముల్లులా ఉంటాయి. అవి చాకుతో గీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని వేపుడుగా చేసుకోవచ్చు. టమాటోతో కలిపి కూరగా మార్చుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది.


జుట్టు రాలడం వంటి సమస్యలు ఇది తగ్గిస్తుంది. చెవి నొప్పి, దగ్గు, పొట్టలో ఇన్ఫెక్షన్లు వంటివి కూడా రాకుండా చేస్తుంది. దీనిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలకు కూడా త్వరగా అరుగుతుంది. డయాబెటిక్ రోగులకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడానికి సహాయపడుతుంది. వానాకాలంలో చాలామందికి శరీరం దురద పెడుతూ ఉంటుంది. అలాంటి దురదల నుంచి ఇది కాపాడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు బోడ కాకరకాయను కచ్చితంగా తినాలి. రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇది ముందుంటుంది. అలాగే గర్భిణీలు కూడా ఖచ్చితంగా తినాల్సిన కూర ఇది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 


Also read: వజ్రాల కన్నా విలువైన టమోటో విత్తనాలు, కిలో ఎన్ని కోట్ల రూపాయలంటే











































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.