World Cancer Day 2024 Theme : ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణమవుతుంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా మరణాలు క్యాన్సర్​ వల్ల సంభవించాయి. 2022లో ఇండియాలో క్యాన్సర్ వల్ల దాదాపు 20 లక్షలమంది ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్యాన్సర్​ కారకాలు, క్యాన్సర్​ను ప్రభావితం చేసే అంశాలు, ఈ సంవత్సరం ఏ థీమ్​తో ముందుకు వస్తున్నారో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రమాద కారకాలు


క్యాన్సర్​ అనేది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా అభివృద్ధి చెంది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం ద్వారా వస్తుంది. పొగాకు వాడకం, ఎక్కువ కాలం మద్యం సేవించడం, అనారోగ్యకరమైన అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం, వాయు కాలుష్యానికి గురికావడం, రసాయనాల వినియోగం వంటివి క్యాన్సర్​కు ప్రమాద కారకాలు. అనేక దీర్ఘాకలిక అనారోగ్యాలవల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వివిధ కారణాల వల్ల వచ్చే వివిధ రకాలు క్యాన్సర్​ను నివారించడం కాస్త కష్టంతో కూడుకున్నది.


ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ ప్రమాదాన్ని పరిష్కరించడం ఆయా దేశాలకు సవాలుగా మారింది. అంతేకాకుండా ప్రజలకు దీనిగురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల.. రోగనిర్ధారణ ఆలస్యమై.. చికిత్స భారం వంటి కారణాలతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా క్యాన్సర్​పై అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతుంది. తక్కువమంది మాత్రమే క్యాన్సర్​ అనే డౌట్​ వచ్చినప్పుడే చికిత్స తీసుకుని దానిని జయిస్తున్నారు. 


ప్రభావం చేసే అంశాలు


అక్షరాస్యత రేటు క్యాన్సర్​ను బాగా ప్రభావితం చేస్తుంది. ఇండియాలో అక్షరాస్యత రేటు బాగానే ఉన్నా క్యాన్సర్​ గురించిన అవగాహన మాత్రం ఇంకా తక్కువగానే ఉంది. కొందరు దీనిని చికిత్స భారాన్ని భరించలేక చనిపోతున్నారు. అందుకే శరీరంలో ఏదైనా మార్పును గుర్తిస్తే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లాలి అంటున్నారు నిపుణులు. లేదంటే సంవత్సరంలో ఓ రెండు సార్లు మొత్తం బాడీ చెకప్ చేయించుకోవాలి అంటున్నారు. 


క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే దానిని తగ్గించడం చాలా తేలిక అవుతుంది. క్యాన్సర్ స్క్రీనింగ్, నివారణ, చికిత్సపై సరైన అవగాహన లేక కొందరు ఇది తగ్గదు అనుకుంటారు. కానీ సమస్యను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటూ.. జీవనశైలిలో మార్పులు చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ అంశాలు తెలియక మధ్య, దిగువ తరగతి వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువైపోతుంది. అందుకే క్యాన్సర్ దినోత్సవం రోజున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్​ను ముందుగానే గుర్తించడం, నివారించడం, చికిత్స వంటి వాటిపై అవగాహన కల్పిస్తుంది. 


ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్


ప్రతి సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం రోజున ఒక్కో థీమ్​ను ఫాలో అవుతున్నారు. ఈ సంవత్సరం క్లోజ్​ ది కేర్ గ్యాప్ అనే థీమ్​తో వచ్చారు. ఇది 2022 థీమ్​కు కొనసాగింపు. ఈ థీమ్ క్యాన్సర్ నివారణ, సంరక్షణలో ప్రాధాన్యత ఇవ్వడానికి, చికిత్సలో పెట్టుబడి పెట్టడానికి, క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని సాధించడానికి సహాయం చేస్తుంది. నివారణ చర్యలు ప్రోత్సాహించడం, ముందస్తుగా గుర్తించడం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్తారు.  2022 నుంచి 2024 (World Cancer Day 2022-2024 Theme)మధ్య ఈ థీమ్​ను ప్రచారం చేస్తున్నారు. ఈ థీమ్​లో ఇది మూడవ, చివరి సంవత్సరంగా చెప్తున్నారు. 


నివారణ 


అనేక రకాల క్యాన్సర్​లను నివారించలేనప్పటికీ.. ఆరోగ్యకరమైన జీవశైలితో క్యాన్సర్​ను కంట్రోల్ చేయవచ్చు. కొన్ని మార్పులతో దీనిని దూరం చేసుకోవచ్చు. నివారించవచ్చు. అయితే జీవనశైలిలో ఏ మార్పులు చేయాలంటే.. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటూ.. ప్రాసెస్​ చేసిన ఫుడ్​ను తక్కువ తీసుకోవాలి. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. రెగ్యూలర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి. పొగాకుకు పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యం లిమిట్​గా తీసుకోవచ్చు. కుదిరితే మొత్తానికి మానేసినా మంచిదే. బయటకు వెళ్లినప్పుడు, ఎక్కువ లైట్​లలో పని చేయాల్సి వచ్చినప్పుడు సన్​స్క్రీన్ రాసుకోవాలి. రసాయనాలకు దూరంగా ఉంటే మంచిది. క్యాన్సర్​కు కారణమయ్యే వైరస్​లకు వ్యతిరేకంగా టీకాలు తీసుకోవాలి. 


Also Read : బడ్జెట్​ సెషన్​లో గర్భాశయ క్యాన్సర్ ప్రస్తావన.. వ్యాక్సిన్ వేయించుకోకుంటే అంత ప్రమాదమా?