Cervical Cancer : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union finance minister Nirmala Sithraman) ఆడపిల్లలకు వ్యాక్సినేషన్‌తో సహా ఆరోగ్య సంరక్షణకు సంబంధించి బడ్జెట్లో పలు ప్రకటనలు చేశారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎందుకు ఈ క్యాన్సర్‌పై అవగాహన తీసుకొస్తున్నారు? ఈ క్యాన్సర్ అంత ప్రమాదమా? ఎలాంటి కారణాలతో ఈ క్యాన్సర్ వస్తుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలో ప్రారంభమయ్యే కణాల పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఇబ్బందికి గురిచేస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటే.. గర్భాశయ క్యాన్సర్ రెండోవ స్థానంలో ఉంది. ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి. హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంది. లైంగికంగా చురుగ్గా ఉంటున్న మహిళల్లో యాభై ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందిలో ఈ వైరస్ వస్తున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో కొంతమందికి అది క్యాన్సర్‌గా మారుతుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ చేయాలని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
చికిత్స
వ్యాక్సినేషన్ వేయించుకోకుండా క్యాన్సర్ బారిన పడితే.. క్యాన్సర్‌ను తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ కణాలను తగ్గించడానికి మందులు, కిమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మందులు ఉంటాయి. రేడియేషన్ థెరపీని కూడా చికిత్సలో భాగమే. అయితే ఈ క్యాన్సర్ ప్రారంభంలో దాని లక్షణాలు బయటపడవు. సమస్య పెరిగేకొద్ది దాని సంకేతాలు, లక్షణాలు బయటపడతాయి.
లక్షణాలు ఇవే..
సంభోగం తర్వాత, పీరియడ్స్ మధ్య లేదా మెనోపాజ్ తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతుంది. ఇది గర్భాశయ క్యాన్సర్‌లో ప్రధాన సంకేతం. ఋతు రక్తస్రావం సాధారణం కంటే ఎక్కువగా.. ఎక్కువ రోజులు ఉంటుంది. యోని ఉత్సర్గ నుంచి దుర్వాసన ఎక్కువగా రావొచ్చు. యోని రక్త స్రావం నుంచి కూడా దుర్వాసన ఎక్కువగా వస్తుంది. సంభోగం సమయంలో నొప్పి, పెల్విక్ నొప్పి ఎక్కువగా వస్తుంది. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కారణాలు
గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి డీఎన్ఎలో మార్పులను అభివృద్ధి చేసినపప్పుడు గర్భాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. హెల్తీ కణాలు వాటి సహజ జీవిత చక్రంలో భాగంగా చనిపోయినప్పుడు అవి కణితిగా మారుతాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీర కణజాలంపై దాడి చేసి నాశనం చేయగలవు. కాలక్రమేణా, కణాలు విడిపోయి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. చాలా గర్భాశయ క్యాన్సర్లు HPV వల్ల సంభవిస్తాయి. ఇది లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే వైరస్.
ప్రమాద కారకాలు
ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉంటే మంచిది. లేకుంటే వైరస్ వల్ల కలిగే అంటువ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కుగా ఉన్నా.. మీ పార్టనర్ లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులో శృంగార చర్యల్లో పాల్గోవడం వల్ల కూడా ఈ ప్రమాదం పెరుగుతుంది. లైంగిక సంక్రమణలు కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉంటే పరిస్థితి విషమంగా ఉంటుంది.
ప్రమాదాన్ని తగ్గించడానికి..
గర్భాశయ క్యాన్సర్ బారిన పడకూడదంటే.. HPV సంక్రమణను నివారించడానికి టీకాలు వేయించుకోవాలి. ఇది సంబంధిత క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేయించుకునే ముందు అది మీకు సరైనదో కాదో అని వైద్యులను అడిగి తెలుసుకోండి. ఈ క్యాన్సర్‌ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తుంది.
Also Read : ఇంతకీ మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా? క్యాన్సర్ మచ్చలా?