Jaggayyapeta News: చదరంగం... కాస్త మెదడుతో ఆలోచించి ఆడాల్సిన ఆట... ఈ ఎప్పుడూ ఒకే ఫార్మెట్‌లో ఉండదు. అవతలి వాళ్ల ఎత్తులకు అనుగుణంగా మన ఎత్తులు ఉండాలి. రాజును కాపాడుకుంటూ ముందడుగు వేయాలి. అవసరమైతే కొన్నిసార్లు మనకు ఎంతో నమ్మకమైన బంటులను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రత్యర్థి సైన్యం రాకుండా రాజుకు అటు ఇటుగా అడ్డు గోడలా కాపు కాసిన కీలక బంటులను వదులుకోవాల్సి వస్తోంది.
ఢీ కొట్టే వాళ్లే కావాలి- విధేయులు కాదు
ఇది అక్షరాల రాజకీయ చదరంగానికీ వర్తిస్తుంది. అవతలి వాళ్ల ఎత్తులకు అనుగుణంగానే మన ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ రంగంలోకి దింపే క్యాండెట్‌ను బట్టి ఒక్కోసారి సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అలాంటప్పుడు అందుకు దీటైనా క్యాండెట్‌ను పెట్టాల్సి ఉంటుంది. ఇన్నేళ్లు పార్టీనే నమ్ముకుని ఉన్నాడు... కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా ఉన్నాడు... అధినేతకు వీరవిధేయుడు ఇలాంటి ఫార్ములాలేవీ అప్పుడు పనిచేయవు.
కులం, ఆర్థిక బలం చూడాల్సిందే
అవతలి క్యాండెట్‌కు దీటైన అభ్యర్థి ఉన్నాడా లేడా.... సామాజిక సమీకరణాలకు సరితూగుతున్నాడా లేడా....ఆర్థికంగా అవతలి వాళ్లను ఢీకొడతాడా లేడా అన్నది మాత్రమే ప్రజలు పట్టించుకుంటారు. ఇక కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీలో మాత్రం కచ్చితంగా ఈ అంశాలు చూసుకోలవాల్సిందే.
మారుతున్న సమీకరణాలు
ఇదే ఫార్ములా ఎన్టీఆర్ జిల్లా(Ntr Dirstic) రాజకీయాలకు వర్తిస్తుంది. ఇక్కడ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నువ్వా నేనా అంటూ పోటాపోటీగా తలపడే నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. రెండు పార్టీలకు ఎంతో కీలకమైన జగ్గయ్యపేట( Jaggayyapet)లో రెండు పార్టీల నుంచి అభ్యర్థులను మార్చవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో గెలుపోటములను డిసైడ్ చేసేది కచ్చితంగా వాళ్లే. ఈసారి తమ సామాజికవర్గం వారికే అవకాశం ఇవ్వాలని 2 పార్టీల్లోని నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్ తెలుగుదేశం(TDP) శ్రేణుల్లో ఎప్పటి నుంచో ఉంది.
కచ్చితంగా తమకు కావాల్సిందేనంటున్న సామాజిక వర్గం
గతంలో మూడుసార్లు వరుసగా గెలిచి మంత్రిగా పని చేసిన నెట్టెం రఘురాం ఆ సామాజికవర్గం నుంచి వచ్చిన వారే. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని ఆర్య, వైశ్య వర్గ నుంచి శ్రీరాం తాతయ్య(Sriram Rajagopal)కు అవకాశం కల్పించారు. ఈ ఎత్తుగడ కలిసొచ్చి ఆయన రెండుసార్లు విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి ఆయనే బరిలో ఉన్నారు. కానీ తమ సీటు తమకు కావాల్సిందేనని కమ్మ సామాజికవర్గం పట్టుబడుతోంది. ఈ వ్యవహారం అధినేత చంద్రబాబు(Chandra Babu) వరకు వెళ్లింది.
ఉదయ భానుపై వ్యతిరేకత
వివాదరహితుడిగా పేరున్న తాతయ్యకు బీసీల్లో మంచి పేరుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో ప్రతిగ్రామంలోనూ సొంతవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే...అధికారపార్టీ నుంచి సామినేని ఉదయభాను(Samineni Udhaya Bhanu) రంగంలో ఉన్నారు. ఇప్పటికే రెండున్నర దశాబ్దాలుగా ఆయనే కాంగ్రెస్, వైసీపీ నుంచి బరిలో ఉంటున్నారు. ఇప్పటికే ఐదుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలుపొందారు కూడా... ఇప్పటికీ వైసీపీకి స్థానికంగా ప్రత్నామ్నాయ అభ్యర్థి లేడు. కానీ ఎన్నాళ్లని ఆయన కింద పనిచేస్తామని వైసీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గం గుర్రుగా ఉంది. ఈసారి కచ్చితంగా అభ్యర్థిని మార్చి తమ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలంటూ వారు సైతం వైసీపీ అధిష్టానానికి విన్నవించుకున్నారు.
అందుకే ఆలోచిస్తున్న జగన్
జగన్ ఎడాపెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇదే సరైన సయమమని ఆ వర్గం నేతలు సైతం ఒత్తిడి పెంచుతున్నారు. పైగా గతంలో ఎప్పుడూ లేనంతగా ఉదయభాను కుటుంబంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే జగన్ ఇప్పటి వరకు జగ్గయ్యపేట టిక్కెట్ ఎవరికి అనేది కన్ఫార్ము చేయలేదని తెలుస్తోంది.
మరోసారి కేశినేని వర్సెస్ వసంత
ఈసారి జగ్గయ్యపేట నుంచి వైసీపీ తరపున కేశినేని నాని(Kesineni Nani) కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) బరిలో దిగనున్నట్లు నియోజకవర్గవ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరిన నాని... కచ్చితంగా తన కుమార్తెకు టిక్కెట్ హామీ తీసుకునే తాడేపల్లికి వెళ్లి వచ్చారని తెలిసింది. అయితే విజయవాడలో ఇప్పటికే సర్దుబాట్లు చేయలేక తలపట్టుకుంటున్న జగన్(YSRCP Chief Jagan)...ఆయనకు జగ్గయ్యపేట టిక్కెట్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
తాతాయ్య బదులు వసంత
శ్వేతకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా కమ్మసామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలని ఆయన ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు జగ్గయ్యపేట టిక్కెట్‌ను కన్ఫార్ము చేయలేదని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో అత్యంత నమ్మకంగా గెలిచే సీటు జగ్గయ్యపేటేనని తెలుగుదేశం భావిస్తోంది. వివాదరహితుడిగా ఉన్న తాతయ్య మంచితనమే తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని అంచనా వేసింది. అయితే మారిన సమీకరణాల దృష్ట్యా...కమ్మ సామాజికవర్గం చేయిజారిపోకుండా ఉండేందుకు అదే వర్గానికి చెందిన వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad)ను రంగంలోకి దించుతోందని వినికిడి.
తిరుమలగిరిని సందర్శించుకున్న వసంత
వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ వీడి తెలుగుదేశంలో చేరతారని ఎప్పుటి నుంచే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఏలూరులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు సైతం ఆయన హాజరవ్వలేదు. ఫిబ్రవరి 5న మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. వసంత కృష్ణప్రసాద్ స్వస్థలం నందిగామ నియోజకవర్గంలోని అంబారుపేట కావడంతో ఆయన సరిహద్దు నియోజకవర్గమైన జగ్గయ్యపేట రాజకీయలతోనూ పరిచయం ఉంది. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు హోంమంత్రిగా పనే చేసిన కాలం నుంచి ఉన్న పరిచయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఈసారి ఆయన జగ్గయ్యపేట నుంచే బరిలో దిగుతారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఎప్పుడూ లేనిది జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి వెంకటేశ్వరస్వామిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నెట్టెం రఘురాం దగ్గర నుంచి శ్రీరాం తాతయ్య వరకు తెలుగుదేశం క్యాండెట్‌లు అందరూ ఎన్నికల ప్రచారానికి ముందు ఈ గుడికి వచ్చి పూజలు చేయడం ఆనవాయితీ. నాలుగు జిల్లాల నుంచి పెద్దఎత్తున ఈ గుడికి భక్తులు తరలివస్తుంటారు. అయితే పక్కనే నందిగామలోనే నివాసం ఉంటున్నా... ఎప్పుడూ ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోని వసంత కృష్ణప్రసాద్... ఒక్కసారిగా సతీసమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేయడంతో ఆయన ఆశీస్సులు తీసుకోవాడనికే వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదీఏమైనా మరోసారి కేశినేని నాని వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ దంగల్ రంజుగా మారనుంది. మైలవరం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన వార్ అంతా ఇంతా కాదు. అప్పుడు తెలుగుదేశం క్యాండెట్ ను గెలిపించుకునేందుకు కేశినాని వసంతతో ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు వచ్చాయి.అయితే అనూహ్యంగా వీరిద్దరూ మళ్లీ వేర్వేరు పార్టీల నుంచే ప్రత్యర్థులుగా తలపడనున్నారు. కుమార్తెను గెలిపించుకునేందుకు నాని ఎలాంటి సాహసాలు చేస్తారో చూడాలి. వీరిరువురూ ఆర్థికంగా, సామాజికవర్గం పరంగా గట్టి క్యాండెట్‌లే కావడంతో జగ్గయ్యపేటలో పోరు మరింత రసవత్తరంగా మారనుంది.