Neurosurgery in Guntur Government Hospital: గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్‌)లో వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. ఓ పేషెంట్‌కు సినిమా చూపిస్తూనే అరుదైన శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఆపరేషన్ థియేటర్ లో రోగికి పోకిరి సినిమా చూపిస్తూ అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఫ్రీగా చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ప్రకటించారు. శనివారం (ఫిబ్రవరి 3) న్యూరాలజీ సెమినార్‌ హాలులో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. 


పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన 48 ఏళ్ల పండు అనే వ్యక్తికి కుడి కాలు, కుడి చేయి బలహీనంగా ఉందని చెప్పారు. ఇతను గతనెల 2న అపస్మారక స్థితిలో ఉండగా జీజీహెచ్‌కు వచ్చారు. న్యూరో సర్జరీ వైద్యులు వివిధ పరీక్షలు చేసి ఆసుపత్రిలో 5వ తేదీన వార్డులో చేర్పించారు. ఎడమ వైపు మెదడులో కుడి వైపున కాలు, చేయి పని చేసే మోటార్‌ కార్టెక్స్‌ భాగంలో కణితి ఉన్నట్లుగా స్కానింగ్ లో డాక్టర్లు గుర్తించారు. సున్నితమైన మెదడులో ఉన్న ఆ కణితిని ఆపరేషన్‌ ద్వారానే తొలగించాలని నిర్ణయించారు. అయితే, ఈ కణితి తొలగించే పక్రియలో భాగంగా కుడి కాలు, చేయి పూర్తిగా చచ్చుబడి పోయే అవకాశం ఉందని డాక్టర్లు అంచనా వేశారు. 


కాబట్టి, ఈ ఆపరేషన్‌ చేయాలంటే రోగి మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే, కళ్లు తెరిచి అన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందుకని డాక్టర్లు రోగి అభిమానించే హీరో మహేష్‌ బాబు నటించిన పోకిరి సినిమా చూపిస్తూ న్యూరో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌లో న్యూరో సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కెవీవీ సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు డాక్టర్‌ గడ్డలా పెంచలయ్య, డాక్టర్‌ సురేంద్రవర్మ, డాక్టర్‌ సత్య నవమి ,పిజి వైద్య విద్యార్థులు డాక్టర్‌ కషుణుడు, డాక్టర్‌ సాయితేజ, డాక్టర్‌ మౌంట్‌రాజ్‌, డాక్టర్‌ మహేష్‌, మత్తు వైద్య విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పోలయ్య, డాక్టర్‌ నాగభూషణం, డాక్టర్‌ ఆదిత్య ప్రదీప్‌, డాక్టర్‌ ఆనంద్‌ పాల్గొన్నారు. ఆపరేషన్‌ తర్వాత రోగికి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జి చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ చెప్పారు. రోగి కాలు చేయి బలహీనత పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.