Guduru Mla Varaprasadarao Comments On YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన వరప్రసాదరావును గత ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యేగా బరిలోకి దించింది. తిరుపతి జిల్లా పరిధిలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయనకు.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టికెట్ నిరాకరించిందన్న విషయం తెలిసినప్పటికీ అధిష్టానం పై ఎన్నాళ్లు మౌనం వహించిన వరప్రసాదరావు.. శనివారం మాత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వరప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. సాధారణంగా సైలెంట్ గా ఉండే వరప్రసాదరావు.. శనివారం మాత్రం కాస్త కఠినంగానే మాట్లాడారు. 


సర్వేల పేరుతో దళిత ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు.. 
సర్వేల పేరుతో ఎస్సీ నియోజకవర్గాలలో మాత్రమే 28 మంది అభ్యర్ధులను మార్చడం బాధాకరమంటూ వరప్రసాదరావు అధిష్టానాన్ని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను తిరుపతి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఐఏఎస్ పోస్టును వదులుకుని రాజకీయాలలోకి వచ్చానని, వైసీపీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీలో చేరానని స్పష్టం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను గడచిన పదాలలో చేశానని వరప్రసాదరావు పేర్కొన్నారు.
పదేళ్లుగా క్రమశిక్షణతో, విధేయతతో పార్టీ కోసం పని చేసిన తనకు అధిష్టానం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని వదులుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిలికా, ఇసుక, ఇతర అక్రమ మైనింగ్ కు పాల్పడలేదంటూ విమర్శలు గుప్పించారు. 


ఓకే చెప్పిన తర్వాత అభ్యర్థిని ప్రకటించారు.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పానని, అలానే అంటూ హామీ ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థిని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం సీఎంకు 59% వస్తే, నాకు 57% వచ్చాయని, అయినా టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు. వైసీపీలో టిక్కెట్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహం వలన ఆయన పిలిస్తే మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లినట్టు పేర్కొన్నారు. టికెట్ విషయం తాను పవన్ ను అడగలేదు, ఆయనా హామీ ఇవ్వలేదన్నారు. సామాజిక న్యాయం తన అజెండా అని, చివరి వరకు రాజకీయాలలో, ప్రజల్లో ఉంటానని స్పష్టం చేశారు. నామినేటెడ్ గా ఇచ్చే పదవులు వద్దని, ఎన్నికలలో పోటీ చేయడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. ఎంపీగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో, లేక స్వతంత్రంగా పోటీ చేస్తానో త్వరలో చెబుతానన్నారు.