Leafy Greens For Lung Health : ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. దాని ఫలితాల ప్రకారం.. పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ K1 ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించవచ్చని వెల్లడించారు.

Continues below advertisement

ఆకుకూరలు రెగ్యులర్​గా తీసుకున్నప్పుడు శరీరానికి విటమిన్ కె అందుతుంది. అసలు విటమిన్ కె అంటే ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? పరిశోధనలోని ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : స్మోకింగ్ తర్వాత ఊపిరితిత్తులను డీటాక్స్ చేయగలమా? లంగ్స్ హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్

Continues below advertisement

విటమిన్ K

విటమిన్ కె రెండు రకాలుగా ఉంటుంది. అది విటమిన్ K1, విటమిన్ K2. విటమిన్ K1 అనేది పాలకూర, బ్రోకలీ, కాలే, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పులియబెట్టిన ఆహారాలు, గుడ్లు, కొన్ని పాల ఉత్పత్తులు, మాంసాహారంలో విటమిన్ K2 ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది.

పరిశోధనలో ఇంట్రెస్టింగ్ విషయాలు

ఆస్ట్రేలియాలోని Edith Cowan Universityకి చెందిన శాస్త్రవేత్తలు 1,79,062 మందిపై పరిశోధన చేశారు. వారి నుంచి ఆరోగ్య వివరాలను సేకరించి.. సుమారు పదిన్నర సంవత్సరాల పాటు విశ్లేషించారు. ఈ స్టడీలో వారి ఆహారంలో విటమిన్ K1, K2 మోతాదును పరిశీలించి.. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో సంబంధాన్ని అధ్యయనం చేశారు.

Also Read : ఊపిరితిత్తుల క్యాన్సర్​ లక్షణాలివే.. ముందుగానే గుర్తించి, ప్రాణాలు కాపాడుకోండిలా

విటమిన్ K1 ఎక్కువగా తీసుకునేవారిలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో COPD అంటే Chronic Obstructive Pulmonary Disease వచ్చే ప్రమాదం సుమారు 16 శాతం వరకు తక్కువగా కనిపించినట్లు గుర్తించారు. ధూమపానం చేసే వారిలో, అలాగే దుమ్ము, రసాయనాలు వంటి కాలుష్య వాతావరణంలో పనిచేసే ఉద్యోగుల్లో ఈ బెనిఫిట్ స్పష్టంగా కనిపించిందట. అయితే విటమిన్ K2 తీసుకోవడం వల్ల COPD ప్రమాదం తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఆస్తమా విషయంలో కూడా విటమిన్ K1 లేదా K2తో ప్రత్యేక సంబంధం కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.

విటమిన్ K1 వల్ల కలిగే లాభాలు..

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ K1 శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రోటీన్లను సక్రియం చేస్తుంది. ఇవి ఊపిరితిత్తుల కణజాలం సౌకర్యవంతంగా ఉండేందుకు, దెబ్బతినకుండా రక్షించేందుకు సహాయపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏదొక సమయంలో ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే విటమిన్ K1 మోతాదును సులభంగా పెంచుకోవచ్చు. 

Also Read : ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే పండ్లు ఇవే.. శ్వాస సమస్యలకు చెక్ పెట్టండిలా

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే COPD వంటి వ్యాధులను నివారించడానికి కేవలం ఆకుకూరలపై మాత్రమే ఆధారపడకుండా.. ధూమపానాన్ని మానేయడం, కాలుష్యానికి దూరంగా ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని చెప్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇది కేవలం ఒక పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే. అంటే విటమిన్ K1 నేరుగా COPDని నివారిస్తుందని ఈ పరిశోధన నిరూపించలేదు. కానీ విటమిన్ K1 ఎక్కువగా తీసుకునే వారిలో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉండవచ్చు. దీనిపై మరిన్ని క్లినికల్ పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.