Lungs Health : ఈ రోజుల్లో ధూమపానం ఊపిరితిత్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అలవాటుగా మారింది. ఫ్యాషన్, స్ట్రెస్ పేరుతో ఆడా, మగ తేడా లేకుండా చాలామంది సిగరెట్లు తాగుతున్నారు. ఒక వ్యక్తి స్మోకింగ్ చేసినప్పుడు, స్మోకింగ్ చేస్తున్నవారి దగ్గర ఉన్నప్పుడు.. వారి ఊపిరితిత్తులు పొగతో పాటు విషపూరిత రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
స్మోకింగ్, కాలుష్యం వల్ల శ్వాసనాళాలలో వాపు, కఫం పేరుకుపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ శోషణ క్రమంగా తగ్గుతుంది. మరి సిగరెట్లు లేదా బీడీలు వంటి పొగాకు తాగే వారు.. ఊపిరితిత్తులను డీటాక్స్ చేసుకోవచ్చా? లేదా వాటిని పూర్తిగా శుభ్రపరిచే పద్ధతి ఏమైనా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
లైఫ్‌స్టైల్ మాత్రమే హెల్ప్ చేస్తుంది..
వాస్తవానికి ఊపిరితిత్తులను ఏ ద్రవంతోనూ లేదా డ్రింక్తోనూ శుభ్రపరచలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే సరైన అలవాట్లు, జీవనశైలి ద్వారా.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని చెప్తున్నారు. లంగ్స్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను చాలా వరకు తొలగించుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. అవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలా హెల్ప్ అవుతాయో చూసేద్దాం.
స్మోకింగ్ వల్ల శ్వాసనాళాలలో వాపు, కఫం పేరుకుపోతుంది. దీనివల్ల శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే ధూమపానం చేసేవారు తరచుగా దగ్గు, ఆయాసం, ఛాతిలో బిగువు వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఎక్కువకాలం స్మోకింగ్ చేస్తే.. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే స్మోకింగ్ మానేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
స్మోకింగ్ మానేస్తే..
వైద్యుల ప్రకారం.. శరీరానికి తనను తాను బాగుచేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి స్మోకింగ్ మానేసిన తర్వాత.. శరీరం క్రమంగా కోలుకోవడం ప్రారంభిస్తుంది. అయితే ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవ్వాల్సి ఉంది.
వ్యాయామం..
ఊపిరితిత్తులను శుద్ధి చేయడానికి వ్యాయామం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అలాగే డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి.. శ్వాసను మెరుగుపరుస్తాయి.
నీరు
తగినంత నీరు తాగడం వల్ల ఊపిరితిత్తులలోని కఫం పలుచబడి.. దానిని బయటకు పంపడం సులభమవుతుంది. ఇది ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
స్టీమింగ్..
వీటితో పాటు రెగ్యులర్‌గా ఆవిరి తీసుకోవడం వల్ల కూడా శ్వాసనాళాలు తేమగా మారి.. పేరుకుపోయిన కఫం వదులై బయటకు వెళ్తుంది. ఈ పద్ధతి ధూమపానం చేసేవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
తేలికపాటి వ్యాయామం, నడక లేదా యోగా కాళ్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమైనప్పుడు.. ఊపిరితిత్తులు మరింత చురుకుగా పనిచేస్తాయి. ఆకుకూరలు, పండ్లు, ఒమేగా-3 ఆహారాలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకుంటే కూడా లంగ్స్‌లోని వాపు తగ్గుతుందని చెప్తున్నారు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
