October is Breast Cancer Awareness Month : రొమ్ము కణాల్లో కణితులు ఏర్పడి.. ట్యూమర్లుగా మారి.. శరీరమంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతాయి. దీనిని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) లెక్కల ప్రకారం.. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 6,70,000 మహిళలు రొమ్ము క్యాన్సర్​తో మృత్యుబారినపడ్డారు. ఈ క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్​గా మారిపోయింది. ముఖ్యంగా క్యాన్సర్ ద్వారా మహిళల్లో సంభవించే మరణాల్లో ఇది రెండో ప్రధాన కారణంగా మారింది. 12 మంది మహిళల్లో 1 ఈ క్యాన్సర్​తో ఇబ్బంది పడుతుంటే.. 71 మంది మహిళల్లో ఒకరు మరణిస్తున్నారట. 









ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏటా అక్టోబర్​నెలలో రొమ్ముక్యాన్సర్​పై అవగాహన కల్పిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్​పై అవగాహన కల్పించే నెలగా అక్టోబర్​ను మార్చారు. ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్​పై ప్రజలకు వివిధ అంశాలను గురించి చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చికిత్సలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 


ట్యూమర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే.. 


క్యాన్సర్​ కణాలు పాల నాళాలు లేదా పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్​ లోపల ప్రారంభమవుతాయి. ప్రారంభ దశల్లోనే వీటిని గుర్తించవచ్చు. ఇవి సమీపంలోని రొమ్ము కణజాలంలోకి వ్యాప్తి చెందుతాయి. ఇవి గడ్డలుగా మారి.. కణితులు అవుతాయి. ఇవి శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించి.. ప్రాణాంతకమవుతాయి. యుక్త వయసు తర్వాత ఏ వయసులోనైనా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంభవించవచ్చు. పురుషల్లో ఇది 0.5 శాతంగా ఉంటుంది. 


లక్షణాలివే.. 


బ్రెస్ట్ క్యాన్సర్​ను ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్సతో దానిని క్యూర్ చేసుకోవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్​ గుర్తించడానికి కొన్ని సంకేతాలుంటాయి. రొమ్ము ముద్దగా లేదా గట్టిగా మారుతుంది. రొమ్ము పరిమాణంలో మార్పులు వస్తాయి. బ్రెస్ట్​పై ఎర్రని మచ్చలు, గుంటలు, స్కిన్​లో మార్పులు వస్తాయి. చనుమొన రూపం మారి.. రక్తం లేదా కొన్ని రకాల ద్రవాలు వస్తాయి. కొందరిలో గడ్డ ఏర్పడిన నొప్పి రాదు. అలాంటివారు వైద్యుల సహాయం తీసుకుంటే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. 


బ్రెస్ట్​లో మొదలయ్యే ఈ క్యాన్సర్ కణాలను గుర్తించకుంటే.. అవి ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, ఎముకలతో సహా అన్ని అవయవాలకు వ్యాపిస్తాయి. దీనివల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. రోగి చనిపోయే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అందుకే వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే ఈ క్యాన్సర్​ను దూరం చేసుకోవచ్చు. లేదంటే ప్రాణాంతకమవుతుంది. 


చికిత్స ఇదే.. 


రొమ్ము క్యాన్సర్​కు చికిత్స అనేది.. క్యాన్సర్ కణాలు శరీరంలో ఎంతవరకు వ్యాపించాయి అనేదానిపై ఆధారపడి ఉంటుంది. బ్రెస్ట్ వెలుపల కణుపులు ఉంటే.. స్టేజ్ 2, స్టేజ్ 3 అంటారు. అదే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే స్టేజ్ 4 అవుతుంది. వీటిని బట్టే చికిత్సల్లో మార్పులు ఉంటాయి. క్యాన్సర్​ తిరిగే వచ్చే అవకాశాలు లేకుండా చికిత్సను అందించేందుకు వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. 


చికిత్స తీసుకునే వ్యక్తి క్యాన్సర్ రకం, దాని వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, మందులు వంటివాటితో క్యాన్సర్​ను కంట్రోల్ చేసేందుకు చూస్తారు. హార్మోన్ ట్రీట్​మెంట్, కీమోథెరపీ లేదా టార్గెటెడ్ బయోలాజికల్ థెరపీలతో సహా వ్యాప్తిని నిరోధించడానికి మందులు ఇస్తారు. 



టార్గెట్ ఇదే.. 


బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలను ఏటా 2.5 శాతం తగ్గించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇనిషియేటివ్ లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. 2020 నుంచి 2040 మధ్య 2.5 మిలియన్ల రొమ్ము క్యాన్సర్ మరణాలను నివారించాలనే ఉద్దేశంతో అక్టోబర్​లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశంపై మహిళల్లో అవగాహన పెంచే విధంగా ప్రోత్సాహిస్తున్నారు. బ్రెస్ట్​ క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే మనుగడ రేటు పెరుగుతుందనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 


Also Read : కొవ్వును కరిగించే హెల్తీ డ్రింక్స్.. బరువును తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యూలర్​గా తాగొచ్చు