Lebanon: పగపట్టిన పాములా మారింది ఇజ్రాయెల్. తన నాశనానికి స్కెచ్ వేసిన హిజ్బుల్లాను అంతం చేయడమే ధ్యేయంగా సాగుతోంది. గురువారం రాత్రి కూడా దాడులతో విరుచుకుపడింది. గతంలో టచ్ చేయని ప్రాంతాలను ఈసారి టచ్ చేసింది. ఇంకా కొందరు హిజ్బుల్లా సీనియర్లు అక్కడ తల దాచుకుంటున్నారనే అనుమానంతో బాంబుల వర్షం కురిపించింది. 


లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాల ప్రకారం బీరుట్‌లో మరిన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 22 మంది మరణించారు. 117 మంది గాయపడ్డారు. ఒక సీనియర్ హిజ్బుల్లా సభ్యుడిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసినట్టు ఉంది. గతంలో జరిగిన దాడుల నుంచి సురక్షితంగా బయపడి ఇక్కడ ఉన్నట్టు సమాచారం. 


దక్షిణ లెబనాన్‌లో దాడులు కొనసాగుతుండగానే ఇప్పుడు వేరే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా సానుభూతిపరులు ఇంకా ఉన్నారన్న అనుమానంతో రాకెట్ దాడులు చేస్తోంది. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం, యునిఫిల్, రాస్ అల్-నఖౌరాలోని ప్రధాన కార్యాలయంపై చేసిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు. 


హిజ్బుల్లా నాయకుడు తప్పించుకున్నాడని...


ఈసారి ఇజ్రాయెల్ హిజ్బుల్లా లియాసన్ అండ్ కోఆర్డినేషన్ యూనిట్ చీఫ్ వాఫిక్ సఫాను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ బీరూట్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడే ఆయనపై దాడి జరిగింది. అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జరిగిన దాడి నుంచి కూడా వాఫిక్ సఫా తప్పించుకున్నట్టు సమాచారం. 


ఇప్పటికే ఇజ్రాయెల్ హిజ్బుల్లా చీఫ్‌ హసన్ నస్రల్లా సహా ఉన్నత స్థాయి  వ్యక్తులను చంపేసింది. ఎక్కడెక్కడో ఉన్న వారందరిని ఐక్యం చేసే పనిలో ఉన్న సఫాతోపాటు మరికొందరు సీనియర్లు ఉన్నారు. అందుకే వాళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. సఫా మొదటి నుంచి హిజ్బుల్లాలో కీలక పాత్ర పోషించారు. 


ఇజ్రాయెల్ దాడులు 22 మంది మృతి
బీరుట్‌లోని అపార్ట్‌మెంట్లు, చిన్న షాపులపై బాంబులు వర్షం కురిసింది. అందుకే 22 మంది మృతి చెందగా 117 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. వాళ్లంతా గతంలో జరిగిన దాడుల నుంచి ఇక్కడకు వచ్చి జీవిస్తున్నారు. 


గురువారం దాడి చేయడానికి ముందు సామాన్య ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే బాంబు దాడులు చేసింది. గతంలో సామాన్య ప్రజలు ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వొద్దని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసే వాళ్లు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదని అంటున్నారు స్థానికులు. అయితే దక్షిణ బీరూట్‌లోకి ఎవరూ రావద్దని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా అక్కడ దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. 


లెబనాన్‌లో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
 లెబనాన్‌లో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. శాంతి పరిరక్షణ చర్యలు సెప్టెంబర్ నుంచి ఆగిపోయినట్టు చెప్పుకొచ్చిన యూఎన్‌, పదివేలకు పైగా పీస్‌కీపర్స్ రోజు రోజుకు ప్రమాదంలో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడులు పెరగడంతో వల్ల ఏర్పడిన ప్రమాదమని తెలిపింది. ఇది అంతర్జాతీయ మానవ హక్కులకు భంగకరమని UNIFIL పేర్కొంది.


Also Read: హుద్‌హుద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?