Han Kang Awarded Nobel Prize In Literature: దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు (Han Kang) ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం (Nobel - 2024 Literature) లభించింది. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు ఆమెకు అవార్డు వరించింది. మానవ జీవితపు దుర్భలత్వాన్ని, చారిత్రక విషాదాలను ఆమె తన గత్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ తెలిపింది. కాగా, గతేడాది నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె (Jon Fosse) సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రధానం ఈ నెల 14 వరకూ కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే ప్రకటించగా.. గురువారం సాహిత్యంలో విజేతను ప్రకటించారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.
ఈ ఏడాది వీరికే పురస్కారాలు
రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను బుధవారం ప్రకటించారు. తమ ప్రయోగాలతో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు డెమిస్ హసబిస్, డేవిడ్ బెకర్, జాన్ ఎం.జంపర్‌లకు ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించి కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కు గానూ చేసిన పరిశోధనలకు రసాయన శాస్త్రంలో వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు. డేవిడ్ బేకర్‌కు కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్‌పై పరిశోధనలతో నోబెల్ వరించగా.. డెమిస్ హసబిస్, జాన్ ఎం జంపర్‌లకు ప్రొటీన్ నిర్మాణం అంచనా వేయడంపై చేసిన పరిశోధనలతో పురస్కారం లభించింది. అటు, జాన్ జే హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ ఈ హింటన్‌లో భౌతికశాస్త్రంలో చేసిన కృషికి నోబెల్ దక్కింది. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్ కున్‌లకు వైద్య రంగంలో చేసిన కృషికి సంయుక్తంగా నోబెల్ ప్రకటించారు. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు ఇద్దరికీ అవార్డు లభించింది.
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ఇస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రధానం చేస్తున్నారు. తొలుత భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి ఏటా నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, 1963 నుంచి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ నుంచి ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఆర్థిక శాస్త్రంలో చేసిన కృషికి సైతం నోబెల్‌కు ఎంపిక చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. అవార్డులను డిసెంబర్ 10వ తేదీన గ్రహీతలకు అందజేస్తారు.
Also Read: Nobel Prize 2024: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్, ప్రొటీన్ పై పరిశోధలకు అత్యున్నత పురస్కారం