Osama Bin Laden Son Deported From France : ఒసామా బిన్ లాడెన్ అంటే.. ప్రపంచాన్ని వణికించిన టెర్రరిస్టు. ఆయన కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ చాలా కాలంగా ఫ్రాన్స్‌లో ఓ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఆయనను అర్జంట్ గా దేశం విడిచి వెళ్లిపోవాలని ఫ్రాన్స్ ఆదేశించింది. అంతే కాదు దగ్గరుండి పంపేసింది కూడా. ఎక్కడికి పంపారు.. ఎక్కడికి వెళ్లాడు అన్నది ఒమర్ బిన్ లాడెన్ ప్రైవసీ కోసం  బయట పెట్టలేదు. తమ దేశంలో మాత్రం ఉండవద్దని చెప్పేసింది. దీనికి కారణం ఆయన పెట్టిన ఓ ట్విట్టర్ పోస్టే. 


ఒమర్ బిన్ లాడెన్ కు ఇంగ్లాండ్ పౌరసత్వం ఉంది. ఆయన ఆ పౌరసత్వం సాయంతో పెళ్లి చేసుకుని ఫ్రాన్స్ లోని ఓ గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాయి. ఇటీవల టెర్రరిస్టులకు మద్దతుగా ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. వారు చేసేది పవిత్ర యుద్ధం అన్న అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉండటంతో వెంటనే  అధికారుల దృష్టికి వెళ్లింది. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన ఫ్రాన్స్ అంతర్గత రక్షణ అధికారులు ఆయన ఫ్రాన్స్ లో ఉండటం ఎంత మాత్రం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చారు. దేశం నుంచి పంపేయాలని తీర్మానించి పంపేశారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అంతర్గత రక్షణ మంత్రి అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.  



ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో ప్రపంచంపై ఉగ్రవాదాన్ని ఎగదోశారు. అయితే ఒమర్ బిన్ లాడెన్ ఆయనకు ఒక్కడే కొడుకు కాదు. మొత్తం ఆయనకు ఇరవై నాలుగు మంది కొడుకులు ఉన్నారని  చెబుతారు. ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెబుతారు. ఒమర్ బిన్ లాడెన్ తండ్రితో కలిసి అల్ ఖైదా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అక్కడ శిక్ష పొందారు. అయితే తర్వాత పూర్తిగా అల్ ఖైదా నుంచి 2000లోనే బయటకు వచ్చారు. ఇరవై నాలుగేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కుటుబంంతో గడుపుతున్నారు. అయితే తన ఉగ్రవాదుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన సానుభూతిగా స్పందిస్తున్నారు. తన తండ్రి ఎంతో గొప్పవాడని చెబుతూంటారు. 


సౌదీలోని నాన్ రాయల్ ఫ్యామిలీల్లో అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో బిన్ లాడెన్ కుటుంబాలది ఒకటి. డబ్బులకు కొదవలేని కుటుంబం అయినా .. ఒసామా టెర్రరిస్టుగా మారారు. తన పిల్లల్లో చాలా మందిని అదే విధంగా మార్చారు.కానీ ఒమర్ మాత్రం.. టెర్రరిస్టు జీవితం నుంచి  బయటకు వచ్చారు. ఆ పాత జ్ఞాపకాలు మనసులో ఉంచుకోకుండా  సోషల్ మీడియాలో పెట్టడంతో ఫ్రాన్స్ నుంచి సర్దుకోవాల్సి వచ్చింది.