Chemistry Nobel Prize 2024: స్టాక్‌హోం: ఈ ఏడాది నోబెల్ పురస్కారాలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదివరకే వైద్యశాస్త్రంలో సోమవారం నోబెల్ ప్రైజ్ ప్రకటించగా, మంగళవారం నాడు భౌతికశాస్త్రంలో ఇద్దరిని నోబెల్ వరించింది. తాజాగా రసాయన శాస్త్రంలో ప్రయోగాలతో విశేష కృషిచేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize In Chemistry) ప్రకటించారు. శాస్త్రవేత్తలు డెమిస్‌ హసబిస్‌, డేవిడ్ బెకర్, జాన్‌ ఎం.జంపర్‌లకు ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించి కంప్యుటేషనల్ ప్రొటీన్‌ డిజైన్‌కుగానూ చేసిన పరిశోధనలకు రసాయనశాస్త్రంలో వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు.


డేవిడ్ బేకర్‌కు కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్ పై పరిశోధనలతో నోబెల్ పురస్కారం లభించింది. డెమిస్‌ హసబిస్‌, జాన్ ఎం జంపర్‌లకు ప్రొటీన్ నిర్మాణం అంచనా వేయడం (Protein Structure Prediction)పై చేసిన పరిశోధనలతో నోబెల్ వరించింది. మెడిసిన్ విభాగంతో మొదలైన ఈ అత్యున్నత పురస్కారాల ప్రదానం ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 10న సాహిత్యం (Noble In Literature) విభాగానికి సంబంధించి నోబెల్ విజేతను ప్రకటించనున్నారు. అక్టోబర్ 11న రోజున నోబెల్‌ శాంతి బహుమతి విజేతను ప్రకటించనుండగా, చివరగా అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను అక్టోబర్‌ 14న అకాడమీ ప్రకటించనుంది.






స్వీడన్‌ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ఆరు రంగాల్లో విశేష కృషిచేసి, సేవలు అందించిన వారికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రతి ఏడాది నోబెల్ బహుమతులు అందజేస్తోంది. డిసెంబర్‌ 10న ఓ కార్యక్రమం నిర్వహించి నోబెల్ గ్రహీతలకు అకాడమీ సభ్యులు ఆ అవార్డులను అందజేస్తారు. 1901 నుంచి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. నోబెల్ గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనార్లు నగదు బహుమతి అందజేస్తారు.


Also Read: Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలు వీరే