మీరు రోజూ బ్రేక్‌ఫాస్ట్ ఎన్ని గంటలకు చేస్తున్నారు? ఒక వేళ సరైన టైమ్‌కు మీరు బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే.. ఇకనైనా ఒక టైమ్ పెట్టుకోండి. ఎందుకంటే.. ఉదయాన్నే తగిన సమయానికి అల్పాహారం తినకపోతే.. డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఉదయం 8 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వారితో పోలిస్తే ఉదయం 9 గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేవారి కి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 59 శాతం పెరుగుతుందని స్పానిష్ శాస్త్రవేత్తలు రుజువులు చూపుతున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ మానెయ్యడం మంచిదికాదని, అలా చేసే వారికి కూడా డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు.


బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నుంచి వచ్చిన  అధ్యయనంలో రాత్రి పది గంటల తర్వాత రాత్రి భోజనం ఆలస్యంగా అంటే రాత్రి 10 తర్వాత తినే వారిలో కూడా డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ అని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.


తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినేవారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ మోతాదులో తక్కువ సార్లు తినేవారితో పోల్చినపుడు తక్కువగా ఉంటుందట. ఉదయం 8 గంటల లోపు మొదటి భోజనం, రాత్రి 7 లోపు చివరి భోజనం పూర్తి చేస్తే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తమ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయని డాక్టర్ మనోలిస్ కోగెవినాస్ స్పష్టం చేస్తున్నారు.


జీవక్రియలు శరీరంలోని జీవగడియారానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. జీవగడియారం వెలుతురును అనుసరించి ఉంటుంది. పగటిపూట మేల్కొని ఉండటానికి సిగ్నల్ గానూ చీకటిని విశ్రాంతికి సంకేతంగా గుర్తిస్తుంది. ఆహారం తీసుకునే విధానం కూడా ఈ సంకేతాల అనుసరించి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఇలా సిర్కాడియన్ రిథమ్ ను అనుసరించకుండా తినడం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్, ఊబకాయం ప్రమాదాలు పెరుగుతాయని ఇదివరకు జరిపిన అధ్యయనాలు సూచించాయి కూడా. డయాబెటిస్ శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ప్రభావశీలంగా లేకపోవడం వల్ల శరీరంలో ఏర్పడే స్థితి. ఇన్సులిన్ చాలా కీలకమైన హర్మోన్. ఇది కణజాలాలకు గ్లూకోజ్ ను అందించే కీ వంటిది. దీని ప్రభావంతోనే గ్లూకోజ్ శరీర కణాలకు అందుతుంది. ఇన్సులిన్ పనితీరు సరిగ్గా లేకపోయినా, తగినంత ఉత్పత్తి కాకపోయినా గ్లూకోజ్ రక్తంలో మిగిలిపోతుంది. ఇలాంటి స్థితిని డయాబెటిస్ అంటారు.


ఇది రెండు రకాలు టైప్ 1 లో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, టైప్ 2 లో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. రెండూ కూడా ప్రమాదకరమైనవే. ఇప్పుడు దీన్ని లైఫ్ స్టయిల్ డిసీజ్ గా పరిగణిస్తున్నారు. వీలైనంత వరకు దీన్ని అదుపులో పెట్టుకోవడం తప్ప పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో లేదనే చెప్పాలి. కనుక ఆహార విహారాలు, వర్కవుట్, విశ్రాంతి వంటివన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నివారించేందుకు అవకాశం ఉంటుంది.


Also read : నగ్నం నిద్రిస్తే బరువు తగ్గుతారా? కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial