ITR Filing: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31తో ముగిసింది. ఈ గడువులోగా రిటర్న్ సబ్మిట్ చేయనివాళ్లకు బీలేటెడ్ ఐటీఆర్ (Belated ITR) ఫైల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు దీనికి అవకాశం ఉంది. అయితే, మీరు ఇప్పటికే ఆదాయ పన్ను పత్రాలు సమర్పించి, రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా?. అయితే మీరు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలుసుకోవాలి.
సాధారణంగా, ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసిన 7 రోజుల నుంచి 120 రోజుల లోపు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ సదరు టాక్స్‌పేయర్‌కు రిఫండ్ చెల్లిస్తుంది. రిఫండ్ మొత్తం అతని బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు రిఫండ్ టైమ్ బాగా తగ్గింది, చాలా మందికి సగటున 15 రోజుల్లోనే డబ్బు తిరిగొచ్చింది. మీరు రిటర్న్ ఫైల్ చేసి ఎక్కువ రోజులు అయినా ఇంకా రీఫండ్ రాకపోతే, ఫైలింగ్ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.
ITR ధృవీకరించడం తప్పనిసరి
ఐటీ రిటర్న్ సక్రమంగా ఫైల్ చేసినా, రిఫండ్ ఆలస్యాన్ని ఎదుర్కొన్న ఎక్కువ మంది కామన్‌గా చేసిన పొరపాటు ఒకటుంది. అది.. ఈ-వెరిఫై చేయకపోవడం. ఏ టాక్స్‌పేయర్ అయినా, రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత దానిని కచ్చితంగా ఈ-వెరిఫై చేయాలి. ఇలా దానికి సంబంధించిన ప్రాసెస్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ ప్రారంభిస్తుంది. ITR ఫైల్ చేసిన 30 రోజుల లోపు ఈ-వెరిఫై చేయడం తప్పనిసరి. ఇంతకుముందు ఈ కాల పరిమితి 120 రోజులుగా ఉండేది. 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ టైమ్ పిరియడ్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ 30 రోజులకు తగ్గించింది. రిటర్న్ ఫైల్ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోపు దానిని ఈ-వెరిఫై చేయకపోతే, ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసినట్లుగా డిపార్ట్‌మెంట్ పరిగణించదు. అప్పుడు, ఆ ITR ప్రాసెస్ ప్రారంభం కాదు, రిఫండ్ రాదు. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం, ఐటీఆర్‌ను ధృవీకరించిన వారికి మాత్రమే పన్ను వాపసు జారీ అవుతుంది.
ITRను ఆన్‌లైన్‌లో ఈ-వెరిఫై చేయడం ఎలా?
ఆదాయ పన్ను పత్రాలు సమర్పించిన తర్వాత, ఆ రిటర్న్‌ను ఆరు పద్ధతుల్లో ఈ-వెరిఫై చేయవచ్చు. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTPని పంపడం ద్వారా, మీ బ్యాంక్ ఖాతా ద్వారా, డీమ్యాట్ అకౌంట్ ద్వారా, ATM లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ద్వారా ఈ-ధృవీకరణ చేయవచ్చు.
ITR ఈ-వెరిఫై అయిందో, లేదో తెలుసుకోవడం ఎలా?
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్‌చేసిన తర్వాత, ధృవీకరణ సమయంలో, ఆదాయ పన్ను విభాగం నుంచి టాక్స్‌పేయర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఈ-వెరిఫికేషన్‌కు గురించిన సమాచారం అందులో ఉంటుంది. ITR ధృవీకరణ పూర్తయిందా, లేదా అన్న విషయంపై ఈ-మెయిల్ ద్వారా కూడా ఇంటిమేషన్ అందుతుంది.
మరో ఆసక్తికర కథనం: నిలకడగా గోల్డ్ రేట్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial