ఇప్పుడు పట్టణాల్లో బొంబాయి చట్నీ కనిపించడం లేదు కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇది కనిపిస్తూనే ఉంటుంది. చేయడం చాలా సులువు అందుకే తరచూ దీన్నే తయారుచేస్తారక్కడ. ఇడ్లీ, పూరీతో ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పూరీతో అయితే మళ్లీ మళ్లీ తింటారు. ఈ చట్నీకి బొంబాయి అనే పేరు ఎందుకొచ్చిందో తెలియదు కానీ ఆ పేరుతో ప్రాచుర్యం మాత్రం బాగా పొందింది. ఇడ్లీకి జతగా కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిలో ప్రధానంగా వాడేది శెనగపిండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో శెనగపిండి చట్నీ అని కూడా పిలుస్తారు.


కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
కరివేపాకు - గుప్పెడు
పసుపు - పావు టీస్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
మినపప్పు - అర స్పూను
శెనగపప్పు - అర స్పూను
నూనె - ఒక స్పూను
ఉప్పు - రుచికి తగినంత


తయారీ ఇలా
1. ఒక గిన్నెలో అరకప్పు శెనగపిండి తీసుకుని అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. ఉండల్లేకుండా బాగా కలపాలి. 
2. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు వేసి వేయించాలి. 
3. అవి వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
4. నీళ్లలో కలిపిన శెగనపిండి మిశ్రమాన్ని కూడా వేసి గరిటెతో బాగా కలపాలి. 
5. మూత పెట్టకుండా ప్రతి రెండు నిమిషాలకోసారి కలుపుతూనే ఉండాలి. తగినంత ఉప్పును చేర్చాలి. 
6. తరచూ గరిటెతో కలపకపోతే ఉండలు కట్టేసే అవకాశం ఉంది. కాబట్టి దించే ముందు వరకు కలుపుతూనే ఉండాలి. 
7. మరీ పలుచగా కాకుండా, అలాగని గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేయాలి. పైన కొత్తమీర చల్లుకోవాలి. కేవలం పదినిమిషాలలో ఈ చట్నీ రెడీ అయిపోతుంది. టేస్టు అదిరిపోతుంది. 
8. కొంతమంది టమోటా ప్యూరీని కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ సేపు ఉడికించాల్సి ఉంటుంది. టమోటా వేయకపోయినా రుచి బాగానే ఉంటుంది. కొంతమంది ఉడకబెట్టిన బంగాళాదుంపలు కూడా వేసుకుంటారు. బంగాళాదుంపలు చేర్చిన రుచి బాగానే ఉంటుంది. 


Also read: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా



Also read: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్


Also read: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో