భూమి ఎలా ఉంటుందో అంతరిక్షం నుంచి చూస్తేనే తెలిసేది. లేదా అంతరిక్షం కేంద్రం నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలు చూడడం ద్వారా తెలుసుకోవాలి. వ్యోమగాములుగా అందరూ మారలేరు కాబట్టి సామాన్య ప్రజల కోసం కొన్ని ప్రత్యేక వీడియోలను, ఫోటోలను విడుదల చేస్తుంటారు నాసా వంటి అంతరిక్ష ప్రయోగ సంస్థలు. తాజాగా రాత్రి పూట భూమి ఎలా కనిపిస్తుందో తెలియజేసే వీడియోను ట్విట్టర్లో ‘వండర్ ఆఫ్ సైన్స్’ అనే ఖాతాతో పోస్టు చేశారు. రాత్రి పూట భూమి మెరుపుతీగలా మెరిసిపోతోంది. భూమిపై ఉన్న సముద్రాలు, పర్వతాలు, ఎడారులు, సిటీలలో పరుచుకున్న లైట్ల కాంతిపుంజాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పగలుతో పోలిస్తే రాత్రిపూట భూమి మరింత ఆకర్షణీయంగా ఉంది. 


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా దేశాలు, కెనడా కలిసి నిర్మించాయి. ఈ అంతరిక్ష కేంద్రం రోజుకు 15 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. వివిధ దేశాల నుంచి వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వస్తూ ఉంటారు. అంత ఎత్తు నుంచి భూమి ఎలా కనిపిస్తుందో వీడియో తీసి పంపారు వ్యోమగాములు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు అద్భుతంగా ఉన్న భూమిని చూసి ఔరా అనుకుంటున్నారు. గ్రహాలన్నింటిలో భూమే చాలా అందమైనదని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు 3.8 మిలియన్ల వీక్షణలు దక్కాయి. మరింతమంది షేర్లు చేశారు.


చాలా ఖరీదు
ప్రపంచంలో మనిషి నిర్మించిన అతి ఖరీదైన వస్తువుల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. 2010లోనే దీని ఖర్చు 150 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ కేంద్రాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు 36 షటిల్ యంత్రాలు పనిచేశాయి. ఇప్పటివరకు 19 దేశాలకు చెందిన వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ఈ కేంద్రాన్ని సందర్శించారు. మొత్తం 239 మంది అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. అధికంగా అమెరికా నుంచే 151 మంది వెళ్లారు. ఇక రెండో స్థానంలో రష్యా ఉంది. రష్యా 47 మందిని పంపింది. 





Also read: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్


Also read: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో