అందంగా కనిపించాలంటే చర్మంలో మెరుపు ఉండాలి. ఎన్ని క్రీములు రాసినా సహజంగా ఉండే చర్మమే అసలైన అందాన్నిస్తుంది. ముఖ్యంగా రక్తం కూడా సరపడినంత ఉంటేనే చర్మం  ఆరోగ్యంగా కనిపిస్తుంది. రక్త హీనతతో బాధపడేవారిలో చర్మం అందంగా కనిపించదు. అందుకే రక్తం సరిపడినంత శరీరంలో ఉంటే అందం కూడా  మెరుగవుతుంది. చర్మసౌందర్యాన్ని, రక్తహీనతను ఒకేసారి తీర్చే మంచి పరిష్కారం ఉంది. అదే బీట్ రూట్, క్యారెట్, టమోటా జ్యూస్. 


చిన్న బీట్ రూమ్ ముక్క, క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు కలిపి కాస్త నీరు వేసి జ్యూస్ చేసుకోవాలి. పిప్పి బయట పడేసి ఆ జ్యూస్‌ను తాగేయాలి. పరగడుపున ఖాళీ పొట్టతో ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు వస్తాయి. రెండు వారాలు ఈ జ్యూస్ తాగితే చాలు మీకు వెంటనే తేడా తెలుస్తుంది. నీరసం తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు చురుగ్గా ఉంటారు. చర్మంలో కూడా మెరుపు కనిపిస్తుంది. ఈ జ్యూస్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. శరీరంలో రక్త హీనత సమస్య ఉన్నప్పుడు మానసిక సమస్యలు కూడా వస్తాయి. కోపం అధికంగా వస్తుంది. యాంగ్జయిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ జ్యూస్ తాగడం వల్ల ఆ ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. 


హైబీపీ రాదు
ఈ జ్యూస్ తాగడం అలవాటుగా మార్చుకుంటే భవిష్యత్తులో  బీపీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. హైబీపీ ఉన్న వాళ్లు దీన్ని తాగితే బీపీ అదుపులో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో కూడా ఇది సాయపడుతుంది. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోకుండా బీట్ రూట్ జ్యూస్ కాపాడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు కూడా రావు. బరువు కూడా త్వరగా పెరగరు. గర్భిణిలు ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. అవసరమైనంత ఫోలిక్ యాసిడ్ దీని ద్వారా బిడ్డకు చేరుతుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా బావుంటుంది. పిల్లలకు తాగించడం వల్ల వారిలో కంటి చూపు మెరుగవుతుంది, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. 


రుచి ఎలా ఉంటుంది?
చాలా మంది పచ్చి బీట్ రూట్ జ్యూస్ అనగానే ముఖం ముడుచుకుంటారు. నిజానికి ఈ జ్యూస్‌ ను ఎవరైనా తాగేయగలరు. దీనికి పెద్దగా టేస్ట్ ఉండదు. నీళ్లలాగే అనిపిస్తుంది. క్యారెట్, టమోటా కలపడం వల్ల కూడా పెద్దగా రుచిలే తేడా రాదు. నీళ్లు తాగినట్టే ఉంటుంది కాబట్టి రుచి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 


Also read: డయాబెటిస్ ఉంటే మందులు వాడాల్సిందేనా? వాడకుండా అదుపులో ఉంచలేమా?
































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.