డయాబెటిస్ వచ్చిందంటే ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అది ఇతర ప్రాణాంతక సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉందని తెలిశాక మాత్రం వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. చాలా మందికి ఒక సందేహం ఉంది. డయాబెటిస్ విషయంలో కచ్చితంగా మందులు వాడాలా? ఆహారంతో అదుపులో ఉంచుకోలేమా? అని. చక్కని ఆహార శైలి, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం... ఇవన్నీ పాటిస్తే కొంతమంది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోగలరు. కానీ ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఆ ప్రయత్నంలో ఉండగానే డయాబెటిస్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. అందులోనూ ఒత్తిడి లేని జీవితం ఈ కాలంలో కష్టమే. కాబట్టి మందులు వేసుకునే విషయంలో అశ్రద్ధ చేయద్దు. డయాబెటిస్ త్వరగా అదుపులోకి రావాలంటే మందులు వేసుకోవాలి.మందులు వేసుకున్నాక, మధుమేహం అదుపులోకి వచ్చాక,అప్పుడు ఆహారపరంగా, వ్యాయామాలు చేస్తూ అలా దాన్ని నియంత్రణలోనే ఉంచేందుకు ప్రయత్నించండి. కానీ ఎప్పటికప్పుడు రీడింగులు చూసుకుంటూ ఉండండి. అదుపులో ఉంచడం కష్టంగా ఉంది అనిపిస్తే మందులు వేసుకోవడమే ఉత్తమం. 


రక్తంలో గ్లూకోజు స్థాయిలు ప్రతి నెలా చూసుకోవాలి. పెరుగుతున్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. వాళ్లు మీ గ్లూకోజు స్థాయిలను బట్టి మందులు మారుస్తారు. అవసరం అయితే ఇన్సులిన్ ఇంజెక్లన్లు సూచిస్తారు. మీ రక్తంలో గ్లూకోజు స్థాయిలను బట్టి మందులు ఆధారపడి ఉంటాయి. మందులు వాడుతున్నాం కదా అని ఏది పడితే అది తినేయకూడదు. నోరుకు కట్టడి అవసరం. పండ్లు, తాజా కూరగాయల మీదే ఎక్కువ ఆధారపడాలి. మైదా, పంచదార పూర్తిగా మానేయాలి. బంగాళా దుంపలు, వైట్ రైస్ వంటివి తగ్గించాలి. వీటిని రాత్రి పూట మాత్రం తినవద్దు. ఒకవేళ తిన్నా కూడా మధ్యాహ్నం భోజనంలో తినాలి. 


గాలి కాలుష్యం నుంచి మధుమేహులు తమను తాము కాపాడుకోవాలి. కొన్ని అధ్యయనాల్లో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వాటికి గాలి కాలుష్యం కూడా కారణమవుతున్నట్టు తేలింది. కాబట్టి ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు మాస్క్ లు ధరించడం మంచిది. అక్కడే ఎక్కువగా గాలి కాలుష్యం ఉంటుంది. 


ఎప్పుడు ఉన్నట్టు?
రాత్రి భోజనం చేశాక పది గంటలు ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఉదయం ఏడు గంటలకు ఖాళీ పొట్టతో రక్త పరీక్ష చేసుకోవాలి. రక్తంలో గ్లూకోజు 125 మి.గ్రా దాటి ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే. అలాగే భోజనం చేశాక 200 మి.గ్రా దాటి ఉంటే మందులు వేసుకోవడం మొదలు పెట్టాలని అర్థం. ఈ విషయం అలసత్వం వహించకూడదు. డయాబెటిస్ అదుపులో ఉండకపోతే మొదటి ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. అవి ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. 


Also read: బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ నిజంగా అదుపులో ఉంటుందా? ఎలా?































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.