Andhra BRS : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి శాఖ దాదాపుగా ఏర్పాటయింది. కాస్త గుర్తింపు ఉన్న నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ వారికి ఎంత ఫాలోయింగ్ ఉందన్న సంగతి పక్కన పెడితే... తోట చంద్రశేఖర్ మూడు సార్లు పోటీ చేసి.. మూడు సార్లు ఓడిపోయినప్పటికీ ఆయనను రాజకీయంపై ఆసక్తి ఉన్న వాళ్లు గుర్తు పడతారు. ఇక రావెల కిషోర్ మాజీ మంత్రి. చింతల పార్థసారధి కూడా పోటీ చేిసన వ్యక్తే.. వీరి వల్ల బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని కానీ.. బలపడిపోతుందని కానీ చెప్పలేం కానీ.. ఏపీలో బీఆర్ఎస్ గమనం మొత్తం పూర్తిగా కేసీఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన అనుసరించబోయే వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఏపీలో కేసీఆర్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది ? ఏపీ ప్రధాన సమస్యలపై ఎలాంటి వ్యూహం అవలంభించబోతున్నారు ? తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ?
ఏపీ అంశాలపై స్పందించని కేసీఆర్ - జాతీయ కోణంలోనే ప్రకటనలు !
ఆంధ్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరిన సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రసంగించారు. ఆయన ఏపీ సమస్యలపై మాట్లాడలేదు. ఏపీ రాజకీయాలపై మాట్లాడలేదు. ఏపీలో దున్నేస్తామని కానీ.. మరొకటి కానీ చెప్పలేదు. పూర్తిగా జాతీయ కోణంలోనే కేసీఆర్ స్పీచ్ సాగింది. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందన్నారు. కేసీఆర్ ప్రసంగం ప్రకారం చూస్తే.. రాష్ట్ర అంశాలపై ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదని.. జాతీయ స్థాయిలో మాత్రమే బీఆర్ఎస్ ఉనికిని చాటేలా ప్రయత్నాలు చేస్తారన్న అభిప్రాయం కొంత మందికి ఏర్పడటం సహజం. అయితే రాష్ట్ర సమస్యలపై నిర్దిష్టమైన విధానం లేకుండా.. ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతున్నారన్నది ఆసక్తికరం.
ఏపీలో ఇప్పుడు ప్రత్యేకహోదా అంశం కాదు.. అమరావతి కీలక అంశం !
గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే అది పరోక్షంగా ఉంటుందని తర్వాత చెప్పారు ఆ ప్రకారం వైఎస్ఆర్‌సీపీకి పరోక్ష మద్దతు ఇచ్చినట్లుగా రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అప్పట్లో ప్రత్యేకహోదా విషయంలో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రెండు తెలుగురాష్ట్రాల ఎంపీల కలిస్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. అవసరైతే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని లేఖ రాస్తానన్నారు. అయితే తర్వాత అలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు ఏపీలో ప్రత్యేకహోదా అంశం కాదు.. ఒక రాజధానా. మూడు రాజధానులా అన్నది సమస్య. దీనిపై కేసీఆర్ ఏదో ఓ విధానం ప్రకటించాల్సి ఉంది.
ఏపీతో ఉన్న వివాదాలపై కూడా ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది !
విభజన ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రెండు తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉమ్మడి ఆస్తులు పంచడం లేదని న్యాయం చేయాలని కోరుతోంది. లక్ష కోట్లకుపైగా ఆస్తులు పంచాల్సి ఉందని చెబుతోంది. అలాగే విద్యుత్ బకాయులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇక జల వివాదాల విషయంలో ఎన్ని ఫిర్యాదులు.. రెండు రాష్ట్రాలపై ఒకరిపై ఒకరు చేసుకున్నారో చెప్పడం కష్టం. పోలవరంప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది పోలవరం ఏడు మండలాలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలంటున్నారు. వీటన్నింటిపైనా కేసీఆర్ క్లారిటీ ఇస్తే ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏమిటో ఓ అంచనాకు వచ్చే చాన్స్ ఉంటుంది.
ఇతర రాష్ట్రాలు వేరు - ఏపీ వేరు !
కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చు.. అక్కడ పెద్దగా సవాళ్లు ఎదురు కావు. కానీ ఏపీలో మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే.. ఏపీ తెలంగాణతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఏపీ వ్యతిరేకత కేంద్రంగానే నడిచింది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్‌ను బలపర్చుకోవాలంటే.. ఎన్నో సమస్యలు అధిగమించాలి. అది పార్టీలో చేరే ఓ మాదిరి నేతల వల్ల కాదు. కేసీఆర్ వ్యూహాల వల్లే సాధ్యం.