Ysrcp volunteer Tension :  గ్రామ వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయంగా వీరికి బదులుగా పార్టీ తరపున గృహసారధుల్ని.. సచివాలయ కన్వీనర్లను తెరపైకి తీసుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశాల్లో మంత్రులు... ఇతర ముఖ్య నేతలు చేస్తున్న కామెంట్లు కూడా వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఆందోళన చెందుతున్న అభిప్రాయాలన్ని కల్పిస్తున్నాయి. 


పథకాలు జగన్ ఇచ్చారని చెప్పాలని నిర్దేశిస్తున్న మంత్రులు !


వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వాలంటీర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వాలంటీర్లకు క్లాస్ చెబుతున్నారు.  పథకాలు ఎవరు ఇస్తున్నారంటే జగన్ ఇస్తున్నారని చెప్పాలని అంటున్నారు. మొన్న ధర్మాన ప్రసాదరావు అదే  చెప్పారు.. నిన్న తానేటివనిత కూడా అదే అంటున్నారు. వాలంటీర్ నేరుగా పథకాలు లబ్దిదారులకు ఇస్తున్నా.. అవి   ఇచ్చేది జగనేనని చెప్పాలని వారంటున్నారు.  . వా వాలంటీర్లు పూర్తిగా  ప్రభుత్వ కనుసన్నల్లో పని చేస్తారు. కానీ నేతల కనుసన్నల్లో కాదు. అధికారులు చెప్పినట్లుగా చేస్తారు. తమ యాభై ఇళ్ల పరిధిలో  వాళ్లు చెప్పినట్లుగానే జరుగుతుంది. పథకాలు ఇవ్వాలన్నా.. తీసేయాలన్నా వారి చేతుల్లోనే ఉంది. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వం గురించి.. జగన్ గురించి చెప్పడం తక్కువైపోయిందన్న అనుమానం పార్టీ నేతల్లో బలపడుతోంది. 


గడప గడపకూ కార్యక్రమంలో వాలంటీర్లదే కీలక పాత్ర !


గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా పథకాలు ఎవరు ఇస్తున్నారు అంటే.. వాలంటీర్ ఇస్తున్నారని చెప్పేవాళ్లే ఎక్కువ. దీంతో వాలంటీర్లు మరీ చేతికి అందకుండా పోతున్నారని కొత్తగా గృహసారధుల్ని జగన్ నియమించమని పార్టీ నేతలను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.   ఇప్పుడు వాలంటీర్లతో పాటు పించన్ ఇవ్వడానికి గృహసారధులు కూడా వెళ్తారని..   జగనన్న  డబ్బులు ఇస్తున్నారని చెబుతారని అంటున్నారు.
 
వాలంటీర్లను త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామన్న స్పీకర్ సీతారాం ! 
 
వాలంటీర్లు వైసీపీ కోసం కష్టపడి పనిచేయాలని  త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించబోతున్నామని స్పీకర్ హోదాలో   తమ్మినేని సీతారాం ప్రకటించారు.  ఆయన  గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రకటన చేశారు. టీడీపీ వస్తే వాలంటీర్లను తీసేస్తారని అంటున్నారని..  ప్రభుత్వం త్వరలోనే వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనలు వాలంటీర్లకు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యం మాత్రమే కాదు.. తాము ప్రారంభించిన వ్యవస్థ తమ చేతుల్లోనుంచి జారిపోతుందేమోనన్న ఓ రకమైన ఆందోళన వారిలో కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


వాలంటీర్ల నిర్వాకాలతో ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు !


వాలంటీర్లు చేస్తున్న అంతర్గత రాజకీయానికి తోడు వారిలో కొంత మంది చేస్తున్న నిర్వాకాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఓ వాలంటీర్ పెన్షన్ కు బదులుగా దొంగ నోట్లను పంపిణీ చేశాడు. మరో వాలంటీర్ పప్పుల చిటీల పేరుతో జనాల్ని మోసం చేసి ఉడాయించింది. మరో వాలంటీర్ పెన్షన సొమ్ముతో పరారయ్యాడు. ఇలా వాలంటీర్ల గురించి వచ్చే వివాదాలు అన్నీ ఇన్నీ కావు.  వీటి విషయంలోనూ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.