మొదటి రోజు - ఎంగిలి పూల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం
తయారీ: కప్పు నువ్వులు తీసుకుని కళాయిలో వేయించాలి. బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం.
రెండో రోజు - అటుకుల బతుకమ్మ
నైవేద్యం - సప్పిడి పప్పుతో పాటూ బెల్లం - అటుకులు
తయారీ- ముందుగా సప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పును కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది సప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు.
ఇక బెల్లం - అటుకుల రెసిపీ కోసం ముందుగా కళాయిలో నెయ్యివేసి జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్ ను చల్లుకోవాలి. అంతే బెల్లం - అటుకుల ప్రసాదం రెసిపీ రెడీ.
మూడో రోజు - ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం - ముద్దపప్పు
తయారీ - కుక్కర్లో కందికపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్ద ప్రసాదం సిద్ధమైనట్టే.
నాలుగో రోజు - నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం - బెల్లమన్నం లేదా పరమాన్నం
తయారీ - ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు వేయచ్చు. మరో పక్క కళాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లంపాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రైఫ్రైట్స్ వేయాలి. అంతే బెల్లమన్నం రెడీ అయింది.
అయిదో రోజు - అట్ల బతుకమ్మ
నైవేద్యం - అట్లు లేదా దోశెలు
తయారీ - ఈ రోజు ప్రసాదం చేయడం చాలా సులువు. ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే అట్లు లేదా దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బియ్యంపిండితో చేసిన అట్లు పెడితే మంచిదని చెబుతారు. దీనికి ఒక గిన్నెలో కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా జారేలా కలుపుకోవాలి. పదినిమిషాలు పక్కన పెట్టాక ఆ రుబ్బుతో అట్లు లేదా దోశెలు వేసి అమ్మవారికి సమర్పించుకోవాలి.
ఆరో రోజు - అలిగిన బతుకమ్మ
నైవేద్యం - ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు
ఏడో రోజు - వేపకాయల బతుకమ్మ
నైవేద్యం - బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ - ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధమైంది.
ఎనిమిదో రోజు - వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం - వెన్నముద్దలు
తయారీ - వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల బటర్ వేయాలి. పిండిలో బటర్ బాగా కలిపేయాలి. కాస్త వేడి నీళ్లు కలుపుకుని చపాతీ పిండిలా వచ్చే వరకు నలపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు రెడీ అయ్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం తీసుకోవాలి. వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం రెడీ అయినట్టే.
తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం - కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహరో, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా నచ్చిన నైవేద్యాలను చేస్తారు. వీటి రెసిపీలను సెపరేట్‌గా ఇచ్చాం.
Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Also read: బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!