రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. ఈ పండుగ వస్తోందటే చాలు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూలతో నిండిపోతాయి. పూలను బతుకమ్మగా పేర్చి దేవతగా కొలిచే అందమైన పండుగ ఇది. బతుకమ్మపై తమలపాకులో లేదా చిక్కుడు ఆకులో పసుపు ముద్దతో గౌరమ్మను పెడతారు. ధూపదీపాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తారు.గౌరమ్మగా చేసిన పసుపును తీసి మంగళసూత్రాలకు అద్దుకుంటారు. తమ పసుపు కుంకాలను, ఇంటిని సకల సౌభాగ్యాలతో చూడమని కోరుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు గౌరమ్మకు ప్రత్యేకంగా చేసే నైవేద్యం నువ్వుల సద్ది. నువ్వుల పొడితో దీన్ని తయారు చేస్తారు.
కావాల్సిన పదార్థాలు:
వండిన అన్నం - నాలుగు కప్పులు
నువ్వులు - అరకప్పు
ఎండు మిరపకాయలు - నాలుగు
కరివేపాకులు - రెండు రెమ్మలు
మెంతి గింజలు - అరస్పూను
నూనె - మూడు స్పూన్లు
ధనియాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూన్లు
పసుపు - అర స్పూను
శెనగ పప్పు - ఒక స్పూను
తయారీ ఇలా...
1. ముందుగా ఒక కళాయిలో నువ్వులు, మెంతులు, ధనియాలు, ఎండు మిర్చి వేసి వేయించి మిక్సీలో పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. అన్నం పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఉప్పు వేసి వండుకుంటే ప్రత్యేకంగా కలుపుకోవాల్సిన అవసరం లేదు.
3. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి.
4. జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు,కరివేపాకులు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
5. చిటికెడు పసుపు కూడా వేసి కలపాలి.
6. ఇప్పుడు అందులో అన్నం వేయాలి.
7. అన్నం పైన ముందుగా చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి.
8. అంతే నువ్వుల సద్ది నైవేద్యం రెడీ అయినట్టే.
నువ్వులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారు, ఐరన్ లోపం ఉన్నవారు నువ్వులతో చేసిన వంటకాలను తింటే మంచిది. నువ్వులు బెల్లం కలిపి తింటే ఈ సమస్యలు త్వరగా పోతాయి. ఎందుకంటే ఈ రెండింటిలోనూ ఇనుము శాతం ఎక్కువే. వీటిలో అమినోఆమ్లాలు, ప్రొటీన్లు కూడా అధికం. మెగ్నీషియం కూడా పుష్కలంగా దొరుకుతుంది. మధుమేహంతో బాధపడేవారు నువ్వుల వంటకాలు తింటే చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చాలా అవసరం. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో ముందుంటుంది. నువ్వుల నూనెతో వండిన వంటలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్, మంచి కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ నూనెను ‘పవర్ హౌస్’ అని పిలవచ్చు. ఈ నూనెలో విటమిన్ ఇ కూడా సంపూర్ణంగా ఉంటుంది.
Also read: సజ్జలతో మసాలా కిచిడీ, డయాబెటిక్ రోగులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్
Also read: ఈ సమయాల్లో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు