Bathukamma Making Procedure : తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన రీజనల్ పండుగల్లో బతుకమ్మ(Bathukamma 2024) ఒకటి. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఎలాంటి పువ్వులను బతుకమ్మను చేయడంలో ఉపయోగించాలో.. ఎలా వాటిని అమర్చి బతుకమ్మను తయారు చేయాలో కొందరికి తెలియదు. బతుకమ్మను ఆర్టిఫీషియల్ వాటితో కాకుండా సహజంగా అడవులలో దొరికే పూలతో తయారు చేస్తే పర్యావరణానికి మంచిది. అయితే బతుకమ్మను పేర్చడంలో ఏయే పూలు ఉపయోగిస్తారో.. ఎలా బతుకమ్మను సిద్ధం చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పూలు ఇవే..
బతుకమ్మను తయారు చేయడానికి ప్రధానంగా గుమ్మడిపువ్వు, తంగేడు, గునుగు పువ్వులు, గుమ్మడి ఆకులు ఉండాలి. చామంతులు, బంతిపూలను కూడా ఇపయోగించవచ్చు. ఈ పూలు అందుబాటులో లేనప్పుడు ఏ పూలనైనా బతుకమ్మ కోసం ఉపయోగించవచ్చు. కానీ ప్రధానంగా ఈ పూలతోనే బతుకమ్మను తయారు చేస్తారు. ఇవే ఎందుకంటే.. వీటివల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి. అయితే బతుకమ్మను ఎలా పేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూలు పడిపోకుండా ఉండేందుకు..
మీ దగ్గర ఉన్న పూలను బట్టి మీరు బతుకమ్మ సైజ్‌ని డిసైడ్ చేసుకోవాలి. లేదంటే మీరు చేయాలనుకుంటున్న దానికి తగ్గట్లు పూలను, పూలరకాలను తెచ్చుకోవాలి. బతుకమ్మను ఇత్తడి ప్లేట్లో చేసుకుంటే మంచిది. అది అందుబాటులో లేనప్పుడు స్టీల్ ప్లేట్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. బతుకమ్మ బోర్లించిన కోన్ రూపంలో వస్తుంది కాబట్టి.. పూలు పడిపోకుండా ఉండేందుకు దారం హెల్ప్ తీసుకోవాలి. బతుకమ్మను చేసేందుకు సరిపడా దారాన్నిముందుగా ప్లేట్లో వేయాలి. మొత్తం బతుకమ్మను అమర్చిన తర్వాత దారాల సాయంతో కలిపి.. బతుకమ్మ చెదరకుండా పైభాగంలో కట్టాల్సి ఉంటుంది.
Also Read : బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు.. స్త్రీ శక్తిని గౌరవిస్తూ, ప్రకృతితో మమేకమై చేసుకునే ఫెస్టివల్ ఇది
బతుకమ్మను తయారు చేసే విధానం..
ప్లేట్, దారాలపై విస్తారకు వేయాలి. విస్తారకు ప్లేట్లోపల సరిపోయేలా కట్ చేసుకోవాలి. దానిని నుంచి దారాలను బయటకు తీసి.. బతుకమ్మను పేర్చుకోవాలి. ఇప్పుడు విస్తరిపై గుమ్మడి ఆకులు వేయాలి. అనంతరం తంగేడు పూలను ఒక లేయర్‌గా అమర్చాలి. మొగ్గలుగా ఉండే తంగేడు పూలను ఉపయోగిస్తే బతుకమ్మ మరింత నిండుగా కనిపిస్తుంది. అనంతరం గునుగుపూలను లేయర్‌గా వేయాలి. ఏ పువ్వును తీసుకుని పేర్చినా.. వాటి కాడలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు బతుకమ్మ కదలకుండా ఉంటుంది.
గుమ్మడి పువ్వును అక్కడే ప్లేస్ చేయాలి..
పువ్వులను అమర్చేప్పుడు గ్యాప్స్ వస్తే వాటి మధ్యలో గుమ్మడి ఆకులు పెట్టాలి. చామంతులు, బంతులు.. ఇతరాత్ర పువ్వులను ఉపయోగిస్తూ బతుకమ్మను శంకం ఆకారంలో పేర్చుకోవాలి. వరుసలు పెరిగే కొద్ది వెడల్పు తగ్గుతూ రావాలి. బతుకమ్మ సమయంలో వివిధ రకాల పూలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా మీరు ఉపయోగించి కలర్‌ఫుల్ బతుకమ్మను తయారు చేసుకోవచ్చు. ఇలా శంఖంలా పేర్చుకున్న తర్వాత చివర్లో గుమ్మడిపువ్వును ప్లేస్ చేయాలి. గుమ్మడి పువ్వు బతుకమ్మ పై భాగంలోనే ఉండాలి.
మొదటిసారి చేసుకునేవారైతే..
ఇలా బతుకమ్మను తయారు చేసుకున్న తర్వాత.. కింద ఉంచిన దారాలను పైకి లాగి.. విస్తారకు, అమర్చిన పువ్వులు కలిసి ఉండేలా పై భాగంలో కట్టాలి. ఇలా కట్టుకోవడం వల్ల బతుకమ్మ జారకుండా ఉంటుంది. ముందుగానే కావాల్సిన వస్తువులు సిద్ధం చేసుకుంటే బతుకమ్మను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొదటి సారి ప్రయత్నించేవారు చిన్న బతుకమ్మను చేసుకుంటే మంచిది. గౌరమ్మకు మొక్కిన తర్వాత.. బతుకమ్మ వేడుకలు ముగిసిన తర్వాత.. దానిని నది లేదా సరస్సులో నిమజ్జనం చేయాలి.
Also Read : బతుకమ్మని ఎప్పటినుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఇవే