ప్రొటీన్ అంటే కేవలం కండలు పెంచాల్సిన వాళ్లకు మాత్రమే అవసరమయ్యేది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కార్బోహైడ్రేట్లు, కొవ్వుతో పాటు శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ముఖ్యమైన పోషకం ప్రొటీన్. 


మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ చాలా కీలకమైన పోషకం. శరీరంలోని ప్రతి కణం రూపొందడానికి, ప్రతి కణ నిర్వహణకు ఇది ఇంధనం లాంటిదని చెప్పవచ్చు. అయితే మన శరీరం కొవ్వు ను నిల్వచెయ్యగలదు కానీ ప్రొటీన్ ను నిల్వచేసి ఉంచుకోలేదు. కనుక కచ్చితంగా రోజు వారీ ఆహారంలో తప్పకుండా ప్రొటీన్ తగినంత ఉండేటా చూసుకోవాలి. ప్రొటీన్ ఎముకలు కండరాల నిర్మాణానికి అవసరం. కణజాలాలకు నష్టం జరిగినపుడు తగినంత ప్రొటీన్ అవసరం అవుతుంది.


ప్రొటీన్ వల్లే శరీరం ఆక్సీజనేట్ అవుతుంది. అంతేకాదు హర్మోన్ల నియంత్రణ, జీర్ణక్రియ వంటి జీవక్రియలన్నింటికి ప్రొటీన్ అవసరం. ముఖ్యంగా వ్యాయామానంతరం  కణజాలాల రికవరీకి, బలహీన పడిన కండరాలు తిరిగి శక్తి సంతరించుకోవడానికి ప్రొటీన్ చాలా ఆవశ్యకం. తగినంత ప్రొటీన్ తీసుకోవడం వల్ల వయసు పైబడే కొద్దీ కండరాల్లో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. బరువు కూడా నియంత్రణలో పెట్టుకునేందుకు తగినంత ప్రొటీన్ తీసుకోవడం అవసరమవుతుంది. ఆకలిని కూడా ప్రొటీన్ నియంత్రిస్తుంది.


శరీరంలో ప్రోటీన్ లోపాన్ని ఎలా గుర్తించాలి?


మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమో ఒకసారి గమనించుకోండి


నిద్ర


సమయానికి నిద్ర పట్టడం లేదా? నిద్రపోవడానికి స్ట్రగుల్ చేస్తున్నారా? రాత్రి నిద్రకు కావల్సిన హార్మోన్ల నియంత్రణలో తేడా వచ్చిందన్నమాట. హార్మోన్‌‌లను నియంత్రించేందుకు అవసరమైన ప్రొటీన్ మీకు తగినంత అందడం లేదని అర్థం.


జుట్టు రాలడం


జుట్టుకు కెరాటిన్ అనే ప్రొటీన్ తోనే తయారవుతుంది. తగినంత ప్రొటీన్ స్థిరంగా తీసుకోకపోతే క్రమంగా జుట్టు సన్నబడి, బలహీనపడి రాలిపోతుంది. తగినంత ప్రొటీన్ తీసుకోకపోతే శరీరం  ప్రొటీన్ ప్రిజర్వ్ చేసేందుకు గాను జుట్టు పెరగడం వంటి అనవసర ప్రక్రియలకు దాన్ని వినియోగించడం మానేస్తుందట.


తరచుగా జలుబు


పెద్ద కారణాలు లేకుండానే తరచుగా జలుబు చేస్తోందా? తరచుగా మీరు ఇలా అనారోగ్యం పాలవుతుంటే తగినంత ప్రొటీన్ అందడం లేదని అర్థం. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి ప్రొటీన్ అత్యవశ్యకం. ప్రొటీన్ తగినంత లేకపోతే తెల్లరక్త కణాల సంఖ్య తగ్గి నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. అందువల్ల తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.


తరచుగా ఆహారం తీసుకోవడం


తరచుగా ఆహారం తీసుకోవాలనే కోరిక కలగడం, రెండు భోజనాల మధ్య ఏదైనా తప్పకుండా తినాల్సి రావడం, ఎప్పుడూ ఆకలిగా ఉన్న భావన కలగడం వంటివన్నీ ప్రొటీన్ డిఫిషియెన్సీ లక్షణాలే. స్వీట్స్ మీదకు మనసు పోతోంది అంటే తగినంత ప్రొటీన్ శరీరంలో లేదని అర్థం.


గాయం మానక పోవడం


చిన్న గాయం అయినా సరే మానేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంటే డయాబెటిస్ వల్ల అలా జరుగుతోందని అనుకోవద్దు. ప్రొటీన్ లోపం వల్ల గాయం నయం కావడానికి కావల్సిన కొల్లాజెన్ ఏర్పడడానికి సమయం పడుతుంది. అందుకే సర్జరీలు జరిగినపుడు కుట్లు బాగా అతకడానికి ప్రొటీన్ ఎక్కువ కలిగిన ఆహారం పెట్టమని డాక్టర్లు సూచిస్తుంటారు.


బ్రెయిన్ ఫాగ్


ఏకాగ్రత లోపిస్తున్నా సరే ప్రొటీన్ తగ్గిందనే సంగతి గుర్తించాలి. మెదడు సరిగ్గా పనిచెయ్యడానికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. సమయానికి వీటిని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చేందుకు ప్రొటీన్ అవసరం. కాబట్టి ప్రొటీన్ తగ్గినపుడు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం సరిగా జరగకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది, ఏకాగ్రత లోపిస్తుంది.


అలసట


ప్రొటీన్ తగ్గితే కండరాల క్షీణత, అలసట, బరువు పెరగడానికి కారణమవుతుంది. ఎక్కువ వ్యాయామం చేసినా తగిన ఫలితాలు కనిపించడం లేదంటే కచ్చితంగా మీరు తీసుకుంటున్న ఆహారంలో ప్రొటీన్ ఎంత మొత్తంలో ఉందో గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


Also read : వినికిడి సమస్యకు, కొలెస్ట్రాల్‌కు లింకేమిటీ? నిపుణులు ఏమంటున్నారు?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial