Daniel Vettori: ఈ ఏడాది మే లో ముగిసిన ఐపీఎల్ - 16లో  పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్‌కోచ్ రాబోతున్నాడు. 2023 సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీకి  హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన  విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు  ఉద్వాసన పలికిన ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం.. కివీస్ మాజీ ఆల్ రౌండర్ డానియల్ వెటోరీని హెడ్‌కోచ్‌గా నియమించింది. ఈ మేరకు సోమవారం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 


గత సీజన్‌లో అత్యంత నిరాశజనకమైన ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న  సన్ రైజర్స్.. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను  కోచ్‌గా నియమించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆండీ ఫ్లవర్‌ ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించేందుకు అంగీకారం తెలిపాడు.  దీంతో  ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్.. వెటోరీ వైపునకు మొగ్గుచూపింది.  వెటోరీ గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడటమే గాక అదే జట్టుకు  2014 నుంచి 2018 వరకూ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.  


ఐదు సీజన్లలో నలుగురు కోచ్‌లు.. 


2018 నుంచి సన్ రైజర్స్ కోచ్‌‌లను పదే పదే మార్చుతోంది. గడిచిన ఆరు సీజన్లలో ఆ జట్టు నలుగురు కోచ్‌లను మార్చింది.  2019లో ఆరెంజ్ ఆర్మీకి టామ్ మూడీ హెడ్ కోచ్‌గా ఉన్నాడు.  కానీ 2020, 2021 లో ట్రెవర్ బెలిస్‌ను కోచ్ ‌గా నియమించిన ఎస్ఆర్‌హెచ్.. 2022లో మళ్లీ టామ్ మూడీని  నియమించుకుంది.  మూడీ మళ్లీ వచ్చినా సన్ రైజర్స్ తలరాత మారలేదు. ఆ ఏడాది బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న లారాను 2023లో హెడ్ కోచ్ గా తీసుకొచ్చింది. లారా కూడా  సన్ రైజర్స్‌ను విజయాల బాట పట్టించలేదు. జట్టులో స్టార్ బ్యాటర్లు, హిట్టర్లు,  మంచి బౌలింగ్ దళం ఉన్నప్పటికీ  వరుసగా మూడు సీజన్లుగా  సన్ రైజర్స్ దారుణ ఓటములను మూటగట్టుకుంటున్నది. మరి వెటోరీ అయినా 2‌024లో సన్ రైజర్స్ కథ మారుస్తాడేమో చూడాలి. 


 






కోచ్‌గా వెటోరి.. 


అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాక వెటోరి..  పలు ఫ్రాంచైజీలతో పాటు  జాతీయ జట్లకూ సేవలందిస్తున్నాడు. యాషెస్ సిరీస్‌తో పాటు బోర్డర్  - గవాస్కర్ ట్రోఫీలో వెటోరి.. ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. బంగ్లాదేశ్ టీమ్‌కు స్పిన్ కన్సల్టెంట్‌‌గా ఉన్న అతడు.. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ ‌కు కోచ్ గా ఉన్నాడు. ఐపీఎల్‌లో గతంలో ఆర్సీబీకి  కోచ్‌గా పనిచేసిన ఈ కివీస్ మాజీ  స్పిన్ ఆల్ రౌండర్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌)లో బార్బడోస్ రాయల్స్‌కు ఆస్ట్రేలియాలో జరిగే  బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్‌కు,  విటాలిటీ బ్లాస్ట్ (ఇంగ్లాండ్)లో  మిడిల్ సెక్స్‌కు  కోచ్‌గా సేవలందించాడు.


న్యూజిలాండ్ తరఫున ఆడుతూ వెటోరి తన కెరీర్‌లో 113 టెస్టులు ఆడాడు.  టెస్టులలో 4,531 పరుగులు, 362 వికెట్లు పడగొట్టాడు.  295 వన్డేలలో 2,253  పరుగులు చేసిన అతడు.. 305 వికెట్లు కూడా  సాధించాడు. 34 టీ20లలో 205 రన్స్, 38 వికెట్లు తీశాడు. 






















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial