GT20 Canada: ఒక టోర్నీలో గానీ సిరీస్‌లో గానీ అత్యద్భుతంగా రాణించినవారికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా  మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బైక్‌నో, కారునో లేదంటే భారీ మొత్తంలో నగదునో అందజేస్తారు  సదరు నిర్వాహకులు. కానీ  కెనడాలో జరిగిన  గ్లోబల్ టీ20 టోర్నీలో మాత్రం ఇందుకు భిన్నంగా.. ఎవరూ ఊహించని విధంగా ఓ ఆటగాడికి అర ఎకరం భూమి ఇచ్చారు. అది కూడా ఏ కొండల్లోనో గుట్టల్లోనో అసైన్డ్ ల్యాండ్స్ అప్పజెప్పారా..? అంటే అదీ కాదు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో...!  ఈ కథా కమామీషు ఏంటో ఇక్కడ చూద్దాం. 


కెనడా వేదికగా ఆగస్టు 6న గ్లోబల్ టీ20 ఫైనల్ జరిగింది.  సర్రే జాగ్వార్స్ - మాంట్రీల్ టైగర్స్ మధ్య తుదిపోరు ఉత్కంఠభరితంగా సాగింది.  ఫైనల్‌లో సర్రే టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి  130 పరుగులు చేసింది.  అనంతరం  బ్యాటింగ్ చేసిన మాంట్రీల్ టైగర్స్.. ఆఖరు బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందుకుంది.  ఈ మ్యాచ్ రాణించిన మాంట్రీల్ బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.  


ఈ టోర్నీలో రూథర్‌ఫర్డ్.. 9 మ్యాచ్‌లు ఆడి 8 ఇన్నింగ్స్‌లలో 44 సగటుతో 220 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ సెంచరీ కూడా ఉంది.  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నెగ్గినందుకు గాను రూథర్‌ఫర్డ్‌కు  ఏకంగా అమెరికాలో అర ఎకరం భూమిని ఇచ్చారు నిర్వాహకులు. ఈ మేరకు జీటీ 20 కెనడా ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది.  మ్యాచ్ ముగిశాక  ప్రెజెంటేషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. రూథర్‌ఫర్డ్‌కు ఇది చాలా బిజీ టైమ్ అని రాసుకొచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్, ఫ్లిఫ్ ఛాలెంజ్ అవార్డులు రూథర్‌ఫర్డ్‌కే దక్కడం విశేషం. 


 






వెస్టిండీస్‌కు చెందిన రూథర్‌ఫర్డ్..  ఐపీఎల్‌లో కూడా  ఆడాడు. గతంలో అతడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు   ప్రాతినిథ్యం వహించాడు.  తాజాగా అరఎకరం భూమిని గెలుచుకున్న రూథర్‌ఫర్డ్‌కు దానిని ఎక్కడ ఇస్తారు..? దాని విలువ ఎంత..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. 


ఇక గ్లోబల్ టీ20 ఫైనల్‌లో భాగంగా  సర్రే జాగ్వార్స్ విధించిన  135 పరుగుల లక్ష్య ఛేదనలో  మాంట్రీల్ తడబడింది.  ఛేదించాల్సింది తక్కువ లక్ష్యమే అయినా ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాలను కొనితెచ్చుకుంది.  ఓపెనర్ మహ్మద్ వసీం డకౌట్ కాగా కెప్టెన్ క్రిస్ లిన్ (31) ఫర్వాలేదనిపించాడు. 61 పరుగులకే  నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన మాంట్రీల్‌ను రూథర్‌ఫర్డ్ ఆదుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో  మాంట్రీల్ విజయానికి  17 పరుగులు కావాల్సి ఉండగా విండీస్ విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ అద్భుతం చేశాడు.  రెండో బంతికి సిక్సర్ కొట్టిన రసెల్.. ఆఖరి బంతికి కూడా సిక్సర్  బాది తన జట్టుకు విజయాన్ని, ఈ సీజన్‌లో ట్రోఫీని కూడా అందజేశాడు. 





















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial