Rahul Gandhi: మణిపూర్ అంశంపై చర్చించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని అస్త్రంగా చేసుకున్నాయి విపక్షాలు. వారం రోజుల క్రితం తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది. మంగళవారం, బుధవారం ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వనున్నారు. గురువారం అవిశ్వాసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. నాలుగు నెలల తర్వాత సోమవారం పార్లమెంటుకు తిరిగి వచ్చిన రాహుల్.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో జూన్ నెలలో మణిపూర్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ ఈరోజు పార్లమెంట్‌లో రెండో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. నాలుగు నెలల తర్వాత పార్లమెంట్ లో మాట్లాడబోతున్న రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏం మాట్లాడబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కౌగిలించుకొని కన్నుగీటారు. అయితే ఈ అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ మధ్యే మోదీ ఇంటి పేరు వివాదంపై చిక్కుకొని ఇబ్బంది పడ్డారు. ఆ విషయంలోనే రాహుల్‌పై అనర్హత వేటు పడగా.. నాలుగు నెలల తర్వాత తిరిగి సోమవారం రోజు పార్లమెంట్‌కు వచ్చారు. ప్రధాని 'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. అయితే పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు అతనికి ఉపశమనం కల్పించింది. దీంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్దరించారు.
మణిపూర్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జూలై 26న లోక్‌సభలో స్పీకర్ ఆమోదించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు మూడు రోజుల సమయం కేటాయించింది. గురువారం (ఆగస్టు 10) ఈ తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానాన్ని ఓడిస్తారా?
లోక్ సభలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఆగస్ట్ 10 వరకు మూడు రోజుల పాటు షెడ్యూల్ ఇలాగే ఉంటుందని, చివరి రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై స్పందించనున్నారు. ఆగస్టు 9న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చర్చలో జోక్యం చేసుకుంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని NDAకి లోక్‌సభలో 331 మంది సభ్యుల మెజార్టీ ఉంది. ఒక్క బీజేపీకే 303 మంది ఎంపీలున్నారు. INDIA కూటమికి 144 మంది కాగా...ఈ కూటమిలోలేని మిగతా పార్టీల ఎంపీలు 70 మంది ఉన్నారు. అంటే...ఏ విధంగా చూసినా అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు లోక్‌సభ ఎంపీలు సభకు హాజరు కావాలని బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. కానీ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ముందుకు తెచ్చినందున మద్దతు ఇచ్చింది. ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశ్యం నెంబర్స్‌లో లేదని మణిపూర్ సమస్యపై ప్రధాని మోడీతో పార్లమెంటులో మాట్లాడించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
పార్లమెంట్‌కి రాహుల్ రీఎంట్రీ..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నాడు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అవిశ్వాస చర్చలో పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకుడు జూన్‌లో మణిపూర్‌ని సందర్శించారు. రెండు రోజుల పర్యటన విషయాలను పంచుకోనున్నారు. 2018 లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో అవిశ్వాస తీర్మానంపై దాదాపు గంటసేపు ప్రసంగించిన తర్వాత అధికార పక్షం వద్దకు వెళ్లిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఆశ్చర్యంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత కన్నుగీటి అందరినీ ఆకర్షించారు.