‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి తెలుగు సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే ఇప్పుడు హిందీ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ముఖ్యంగా నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలకు రాధికా ఆప్టే బెస్ట్ ఛాయిస్‌గా మారింది మేకర్స్‌కు. రాధికా ఇంకా తమిళ, మరాఠీ, బెంగాళీ భాషల్లో కూడా నటించింది. హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇటీవల ఆమె తనకు టాలీవుడ్‌లో ఎదురైన ఓ ఘోర అనుభవం గురించి చెప్పుకొచ్చింది.


ఆయన చాలా పవర్‌ఫుల్ అన్నారు..
2018లో ఒక తెలుగు చిత్రం షూటింగ్ తొలి రోజే ఓ టాప్ హీరో నుంచి ఘోరమైన అనుభవం ఎదురైందని రాధికా ఇటీవల బయటపెట్టింది. ‘‘అది తెలుగు సినిమాలో నా మొదటి రోజు. అందులో నా ఆరోగ్యం బాగా ఉండకపోవడంతో నేను పడుకునే సీన్ ఒకటి ఉంటుంది. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతా సెట్ అయిపోయి ఉంది. అప్పుడే ఆ సీనియర్ హీరో లోపలికి వచ్చారు. మేము రీహార్సెల్స్ చేస్తున్నాం. నాకు అప్పటికీ ఆయన ఎవరో తెలియదు. అయినా ఆయన నా కాలికి కితకితలు పెట్టడం మొదలుపెట్టారు. ఆయన చాలా పెద్ద యాక్టర్. అంతే కాకుండా చాలా పవర్‌ఫుల్ అని కూడా నాతో చాలామంది చెప్పారు’’ అని రాధికా బయటపెట్టింది.


అందరి ముందు వార్నింగ్..
సీనియర్ హీరో అయినా కూడా తనకు కోపం వచ్చినప్పుడు, వారు చేసేది ఏదైనా తనకు నచ్చనప్పుడు మొహం మీదే చెప్పేస్తానని, అందుకే ఆ సమయంలో అలా మళ్లీ ఎప్పటికీ, ఎప్పటికీ చేయవద్దని ఆ సీనియర్ హీరోకు వార్నింగ్ ఇచ్చానని రాధికా బయటపెట్టింది. అక్కడ మొత్తం క్రూ, జూనియర్ ఆర్టిస్టులు, అందరూ ఉన్నారు. అందరి ముందే అలా గట్టిగా చెప్పానని తెలిపింది. తాను అలా చెప్తానని ఊహించని ఆ హీరో కాస్త షాక్ అయ్యారని గుర్తుచేసుకుంది. ఏది ఏమైనా ఆ హీరోతో మళ్లీ తనను టచ్ చేయలేదని చెప్పింది. 


ఆ హీరోనే ఏమో అంటూ అనుమానాలు..


అయితే, రాధిక ఆప్టే చెప్పిన వివరాలు మన తెలుగులోని ఓ సీనియర్ హీరోతో పోలీ ఉండటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆమె ఆ హీరోతో రెండు సినిమాలు చేసింది. దీంతో ఎవరైనా సరే ఆ హీరోనే అనుకుంటారు. దీంతో ఆమె కావాలనే టాలీవుడ్‌పై బురద చల్లుతోందని నెటిజనులు అంటున్నారు. అలాంటివి జరిగినప్పుడు అప్పుడే ఎందుకు చెప్పలేదు? మరో సినిమా ఎందుకు చేసినట్లు అని ట్రోల్ చేస్తున్నారు. రాధికా ఆప్టే ఇటీవల ‘మిసెస్ అండర్‌కవర్’ అనే చిత్రంలో నటించింది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలనే అందుకుంది. ప్రస్తుతం తన చేతిలో ‘మెర్రీ కృస్మస్’ అనే హిందీ సినిమాతో పాటు ‘సిస్టమ్ మిడ్‌నైట్’ అనే ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది.


Also Read: 'మీ బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోండి' అంటూ దీపికా సలహా - రణవీర్ సింగ్ స్పందన ఇదీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial